Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు సెటిట‌ర్ల ప్ర‌శ్న‌లు డిలీట్?

By:  Tupaki Desk   |   29 Oct 2018 5:30 PM GMT
కేటీఆర్ కు సెటిట‌ర్ల ప్ర‌శ్న‌లు డిలీట్?
X
ఇంత పెద్ద మ‌హాన‌గ‌రంలో ఏదో ఒక మూల ఏదో ఒక స‌మావేశ‌మో.. స‌భో జ‌రుగుతూ ఉంటుంది. కొన్ని స‌భ‌ల‌పై ఎలాంటి అంచ‌నాలు ఉండ‌వు. కానీ.. రాత్రి అయ్యేస‌రికి వాటిల్లో కొన్ని కీల‌కంగా మార‌ట‌మే కాదు.. ప‌క్క‌రోజున అవే బ్యాన‌ర్ వార్త‌లుగా మారుతుంటాయి. తాజాగా.. అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది.

నిజాంపేట‌లో నిర్వ‌హించిన హ‌మారా హైద‌రాబాద్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నతాజా మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి.. అక్క‌డి సెటిల‌ర్లు ( ఆ మాట‌కు వ‌స్తే వారిలో ఎక్కువ‌మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేన‌ని చెబుతారు) త‌మ‌కున్న సందేహాల్ని కేసీఆర్ అడిగిన‌ట్లే అడిగి.. ఇరుకున పెట్టేశారు.

రాబోయే రాజుల్లో కాబోయే ముఖ్య‌మంత్రి అన్న ప్ర‌చారం జోరుగా సాగుతున్నా.. కేటీఆర్ ను ప్ర‌శ్నించే విష‌యంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌ని సెటిట‌ర్ల సందేహాల‌తో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన 21 మందిలో కొంద‌రు కేటీఆర్ ను సూటిగా ప్ర‌శ్నించ‌టం.. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు సీమాంధ్రుల మ‌నోభావాల్ని గాయ‌ప‌రుస్తున్నాయ‌ని.. ఈ వ్య‌వ‌హారంపై కేసీఆర్ చేత ఒక వివ‌ర‌ణ ఇప్పించాల‌న్న మాట‌తో పాటు.. ఒక అడుగు ముందుకు వేసి.. క్ష‌మాప‌ణ (?) లాంటి త‌ర‌హాలో ఒక ప్ర‌క‌ట‌న చేయిస్తే మ‌రింత బాగుంటుంద‌న్న సూచ‌న కూడా చేశారు.

ఏదేంది? కేసీఆర్ లాంటి పెద్ద మ‌నిషి తాను చేసిన వ్యాఖ్య‌ల మీద క్ష‌మాప‌ణ‌(?) లాంటిది చెప్ప‌ట‌మా? అలాంటిది ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డైనా చూశామా? (అప్ప‌ట్లో కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఆయ‌న నివాసం ఎదుట మంద‌కృష్ణ నిర‌స‌న చేసి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ నిర‌స‌న చేప‌ట్ట‌టం.. త‌ర్వాత కాలంలో ఆ మాట‌ల్ని తాను వెన‌క్కి తీసుకున్న‌ట్లుగా చెప్ప‌టం జ‌రిగింది)

తాను అన‌ట‌మే త‌ప్పించి.. తిరిగి దాని గురించి వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌టం లాంటివేమీ లేని కేసీఆర్ చేత ప్ర‌క‌ట‌న చేయించాల‌ని అడ‌గ‌ట‌మే పెద్ద విష‌యం. అది కూడా కేటీఆర్ ను నేరుగా. మామూలుగా అయితే ఎలా ఉండేదో కానీ.. ఎన్నిక‌ల వేళ‌.. అందునా వాతావ‌ర‌ణం త‌మ‌కు అనుకూలంగా లేద‌న్న వాద‌న‌లు పెరుగుతున్న వేళ కావ‌టంతో కేటీఆర్ సైతం త‌న దూకుడు స్వ‌భావానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కొస‌మెరుపు ఏమంటే.. కేటీఆర్ నే నేరుగా అడిగేసిన సెటిల‌ర్ల (అవ‌సరానికి త‌గ్గ‌ట్లుగా పిలిచే) ప్రోగ్రాం కొన్ని ఛాన‌ళ్ల‌లో లైవ్ అయ్యింది. అయితే.. ఆ త‌ర్వాత దానికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఏమీ ప‌ని చేయ‌క‌పోవ‌టం విశేషం. కేటీఆర్ ప్ర‌సంగం ఉంచారే కానీ.. సెటిల‌ర్ల సూటి ప్ర‌శ్న‌ల‌ను యూట్యూబ్ లో డిలీట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎంత ఇరుకున పెట్టేలా ప్ర‌శ్నిస్తే మాత్రం.. అలా డిలీట్ (?) చేసేస్తారా? అన్న క్వ‌శ్చ‌న్ ప‌లువురి నోట వినిపిస్తోంది.