Begin typing your search above and press return to search.

కరీంనగర్ లో ఇండోనేసియా ముస్లింలు..కరోనాను అంటించేశారా?

By:  Tupaki Desk   |   19 March 2020 2:15 PM GMT
కరీంనగర్ లో ఇండోనేసియా ముస్లింలు..కరోనాను అంటించేశారా?
X
ప్రాణాంతక వైరస్ కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు పెను కలకలమే రేగింది. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు తిరిగివస్తున్న నేపథ్యంలో వారినే క్వారంటైన్ లోకి పంపుతూ ఉంటే.. .మన దేశానికే చెందని ఇండోనేషియా ముస్లింలు ఓ పది మంది దాకా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించడం - అక్కడ సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలను నిర్వహిస్తున్న వైనం బయటపడటంతో ఇప్పుడు కరీంనగర్ జిల్లాతో పాటు యావత్తు తెలంగాణలో పెను కలకలమే రేగింది. ఈ పది మంది ఇండోనేషియా ముస్లింలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి.

కరోనా నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా భారత దేశం పెద్ద ఎత్తున నివారణ చర్యలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా కరోనా నివారణ చర్యల విషయంలో తెలంగాణ అత్యుత్తమ చర్యలను తీసుకుంటోందని ఇటీవలే కేంద్రం కూడా కితాబిచ్చింది. అయితే... ఓ పది మంది ఇండోనేషియా నుంచి రాష్ట్రానికి రావడం - వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేయడం - తాము ఇక్కడే కొన్ని రోజుల పాటు ఉంటున్నామని చెప్పిన తర్వాత కూడా వారిపై నిఘా పెట్టకపోవడం - అసలు వారికి కరోనా ఉందా? లేదా? అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు చూస్తుంటే... నిజంగానే కరీంనగర్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లోకి నెట్టివేయబడ్డారని చెప్పక తప్పదు.

అయినా ఇండోనేషియాకు చెందిన ముస్లింలు కరీంనగర్ రావడం - సీఏఏపై నిరసనలను నిర్వహించడం చూస్తుంటే... నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు దేశంలోని ప్రవేశిస్తున్నారన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో చాలా ఈజీగా ఇండోనేషియాకు చెందిన పది మంది ముస్లింలు తెలంగాణలోకి ప్రవేశించడం - నగరంలో వారు చాలా స్వేచ్ఛగా సంచరించడం - ఎలాంటి అడ్డంకులు లేకుండానే వారు నిరసనలు నిర్వహిస్తున్న వైనం నిజంగానే ఆందోళన కలిగించే విషయమే. మొత్తంగా ఇండోనేషియా ముస్లింలు దేశంలోకి ప్రవేశించడమే ఓ ఆశ్చర్యమైతే.. వారు ఏకంగా సీఏఏ నిరసనలకు నేతృత్వం వహించడం కూడా మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోకి ప్రవేశించిన ఇండోనేషియా ముస్లింలు... కరోనా పరీక్షలకు సహకరించినా... ఆ తర్వాత ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే సమయంలో తీవ్రంగా ప్రతిఘటించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా... ఐసోలేషన్ కేంద్రాల నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారని - ఈ సందర్భంగా వారిని నియంత్రించడం ఆయా ఐసోలేషన్ కేంద్రాల్లోని సిబ్బందికి సాధ్యం కాలేదన్న వార్తలు కలకలం రేపుతోంది. మొత్తంగా కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించిన ఇండోనేషియా ముస్లింల కారణంగా కరీంనగర్ నగరం - జిల్లాతో పాటు మొత్తం తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.