Begin typing your search above and press return to search.

కొవిడ్ తాట తీసే ట్యాబ్లెట్ ను ఎలా వాడాల్సి ఉంటుంది?

By:  Tupaki Desk   |   29 Dec 2021 6:33 AM GMT
కొవిడ్ తాట తీసే ట్యాబ్లెట్ ను ఎలా వాడాల్సి ఉంటుంది?
X
కొవిడ్ భయం మొదలై దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తోంది. ప్రపంచం కరోనా అనే మాటను 2019 డిసెంబరు నెలలోనే విన్నది. అంతకు ముందు వరకు కరోనా గురించి అవగాహన ఉన్న వారు చాలా తక్కువగా ఉండేవారు. వూహాన్ పుణ్యమా అని.. ఈ మాయదారి వైరస్ ప్రపంచ దేశాల్ని వణికించటమే కాదు.. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఒకే అంశం మీద.. ఒకే సమయంలో.. ఎక్కువ మంది సాధారణ ప్రజలు మరణాల బారిన పడటం లాంటిది కొవిడ్ కారణంగానే చోటు చేసుకుంది.

ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ మొత్తం పడకేసిన ఈ ప్రత్యేక సందర్భం.. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అనుభవాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. తమ ఆదాయంలో అత్యధిక భాగం ఆరోగ్యం మీదన వెచ్చించిన ప్రత్యేక సందర్భంగా చెప్పాలి. అలాంటి కరోనాకు చెక్ చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. కొవిడ్ పీచమణిచేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం దగ్గర దగ్గర నూటయాభైకు పైగా ఫార్మా కంపెనీలు.. పరిశోదనా కంపెనీలు పరిశోధనలు చేస్తే.. కొన్ని ప్రయోగాలు మాత్రమే సానుకూల ఫలితాలు నమోదు చేయటమే కాదు.. వ్యాక్సిన్ ను తీసుకొచ్చాయి.

సూదిమందు కాకుండా కరోనాకు ట్యాబ్లెట్ల రూపంలో మందును తీసుకొచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నించాయి. అందులో సక్సెస్ అయ్యింది చాలా తక్కువ మంది. వారిలో ఒకరి గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. అమెరికాకు చెందిన రిడ్జ్‌బ్యాక్‌ బయో థెరప్యూటిక్స్‌, ఫార్మా దిగ్గజం మెర్క్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ కొవిడ్ మాత్ర ‘‘మోల్నుపిరవిర్’’పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ ను భారత్ లోని 13 ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయనున్నాయి.

ఇంతకీ ఈ ట్యాబ్లెట్లను ఎలా వాడాల్సి ఉంటుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. రోజుకు రెండుసార్లు మొత్తం నాలుగు మాత్రల చొప్పున ఐదు రోజుల పాటు వినియోగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మాత్రల్ని వేసుకున్న కరోనా రోగి కోలుకుంటారని చెబుతున్నారు. కరోనా పాజిటివ్ గా తేలిన వారు ఈ మోల్నుపిరవిర్ మాత్రల్ని 5 రోజుల పాటు వాడితే.. బాధితులు త్వరగా కోలుకోవటం ఖాయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించిన సంతోషకరమైన వార్త ఇంకేం ఉంటుంది చెప్పండి?