Begin typing your search above and press return to search.

శ‌వాల మ‌ధ్య‌లో వేశ్య‌ల నాట్యం!

By:  Tupaki Desk   |   29 March 2018 1:45 PM GMT
శ‌వాల మ‌ధ్య‌లో వేశ్య‌ల నాట్యం!
X
భార‌త‌దేశం....భిన్న సంప్ర‌దాయాలు, సంస్కృతుల స‌మ్మేళ‌నం. అందుకే మ‌న దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర‌క‌ర‌కాల ఆచారాలు, వేష‌భాష‌లు ఉంటాయి. ఒక ప్రాంతంలో ప్ర‌జ‌లు ఆచ‌రించే సంప్ర‌దాయం...మ‌రో ప్రాంతం వారికి విడ్డూరంగా, వింత‌గా అనిపించ‌వ‌చ్చు. త‌ర‌త‌రాలుగా ఆ ఆచారాన్ని పాటిస్తున్న ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అది స‌ర్వ సాధార‌ణం కావ‌చ్చు. అదే త‌ర‌హాలో, హిందువుల‌కు అతి ప‌విత్ర‌మైన వార‌ణాసి పట్ట‌ణంలో ఓ వింత ఆచారం కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాలుగా ఆచ‌ర‌ణలో ఉంది. నిత్యం ద‌హ‌న‌సంస్కారాలు జ‌రిగే శ్మ‌శాన వాటిక‌లో నృత్యాలు చేసే సంప్ర‌దాయం ఆ ప్రాంతంలో అమ‌ల్లో ఉంది. ప్ర‌తి ఏటా వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ వద్ద చైత్ర నవరాత్రి సప్తమి రోజు రాత్రి నుంచి తెల్లవారే వరకూ వేశ్యలు అవిరామంగా నృత్యాలు చేయ‌డం విశేషం.

మణికర్ణిక ఘాట్‌ వద్ద వేశ్యలు చేసే నృత్యాన్ని ‘తపస్యా’ అంటారు. ఆ రోజున వేశ్యలు ఘాట్ ద‌గ్గ‌ర‌కు వచ్చి బాబా ముందు త‌న్మ‌య‌త్వంతో నృత్యం చేస్తారు.ఆ వేశ్య‌లు అలా నాట్యం చేయ‌డం వెనుక ఓ క‌థ ఉంది. మణికర్ణిక ఘాట్‌ వద్ద పార్వతికి దూరమైన మహాశివుడు తాండవ నృత్యం చేశాడని ప్ర‌తీతి. అంతేకాకుండా, అక్బర్‌ నవరత్నాల్లో ఒక‌రిగా ప్ర‌ఖ్యాతి గాంచిన రాజా మన్‌ సింగ్‌....16వ శతాబ్దంలో ఈ ఘాట్ లో ఓ ఆలయాన్ని మహాశివుడికి అంకితం చేశార‌ట‌. ఆ సంద‌ర్భంగా అక్కడ ఓ నృత్య విభావరిని ఏర్పాటు చేశార‌ట‌. అయితే, శవాల మధ్య న‌ర్తించేందుకు ఎవ‌రూ రాక‌పోవ‌డంతో.....వేశ్యలు వ‌చ్చి నాట్యం చేశార‌ట‌. దీంతో, ఆనాటి నుంచి ప్ర‌తి చైత్ర నవరాత్రి సప్తమి రోజున వేశ్యలు అక్క‌డ నాట్యం చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే, వారు వేడుక కోసం న‌ర్తించ‌ర‌ట‌. జీవితంలో తాము చేసిన తప్పులకు ప‌శ్చాత్తాపం కోరుతూ మహా శంషాన్‌ బాబా ముందు నృత్యం చేస్తార‌ట‌. దానివ‌ల్ల శేష జీవితంలో త‌మ‌కు ఆనందం - గౌరవం దక్కుతాయని ఆ వేశ్యల నమ్మకం.