Begin typing your search above and press return to search.

తెలంగాణాలో ఉన్న‌ది యూ టర్న్‌ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   18 Sep 2016 6:05 AM GMT
తెలంగాణాలో ఉన్న‌ది యూ టర్న్‌ ప్రభుత్వం!
X
తెలంగాణ ప్రభుత్వం ఉదయం తీసుకున్న నిర్ణయాన్ని సాయంత్రానికి మార్చుతుందని - ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ శాస‌నమండ‌లి నాయ‌కుడు షబ్బీర్‌ అలీ ఎద్దేవా చేశారు. నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో ఎటువంటి శాస్రీయవిధానం అవలంబించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాల విభ‌జ‌న పేరుతో గ్రామ గ్రామానికి - ప్రాంతాల వారికి చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ది పొందేందుకు కేసీఆర్ ప్ర‌యత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీమంత్రి ప్రసాద్‌ కుమార్‌ - డి.శ్రీధర్‌ బాబులతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్థానాల సంఖ్య పెంచిన అనంతరం నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని తెలిపి, అనంతరం మాట మార్చి నూతన జిల్లాలకు శ్రీకారం చుట్టాడని మండిప‌డ్డారు.

జిల్లాల ఏర్పాటు ఏ ప్రాతిపదికన ఏర్పడుతుందన్న విషయానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ష‌బ్బీర్ అలీ తెలిపారు. గత 60 సంవత్సరాలు సమైక్య వాదుల‌తో పోరాడిన తెలంగాణవాదులు నేడు ప్రాంతాల వారీగా - గ్రామ గ్రామాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటుండ‌టం చూస్తున్నార‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం రంగారెడ్డి - ప్రకాశం - విజయనగరం జిల్లాలు ఏర్పాటు చేసినపుడు ఓ శాస్రీయమైన విధానాన్ని అవలంభించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి జిల్లాలను ఏర్పాటు చేసిందని ష‌బ్బీర్ అలీ గుర్తుచేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినప్పటికి ఇప్పటికి ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కేవలం ప్రజా ప్రతినిధులను సంతృప్తి పర్చటం కోసం జిల్లాల ఏర్పాటు తగదని త‌ప్పుప‌ట్టారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ ఉన్నప్పటి నుండి ఉన్న జ‌న‌గామ‌ - గ‌ద్వాల జిల్లాల కోసం ప్రతిపక్ష పార్టీగా ఈ జిల్లాల పోరాటం చేస్తామని ష‌బ్బీర్ అలీ తెలిపారు.