Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ముందస్తు...పిచ్చోడి చేతిలో రాయి!!

By:  Tupaki Desk   |   22 Aug 2018 7:46 AM GMT
కేసీఆర్‌ ముందస్తు...పిచ్చోడి చేతిలో రాయి!!
X
కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో ఉన్న ముందస్తు ఎన్నికల వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో అంతకంతకూ వేడెక్కుతోంది. అసెంబ్లీని రద్దుచేసి గడువుకన్నా ముందే ఎన్నికలకు వెళ్ళాలని టీఆర్ ఎస్‌ అధినేత - సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర మంత్రులతో కీలక భేటీని జరపాలని నిర్ణయించారు. నాలుగు గంటలకు ప్రగతి భవన్‌ లో కేసీఆర్‌ మంత్రులు - అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు - సీనియర్లతో సమావేశమై ముందస్తు ఎన్నికలపై చర్చించాలని నిర్ణయించారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. కేసీఆర్ ఆలోచ‌న పిచ్చోడి చేతిలో రాయి అని ఎద్దేవా చేసింది.

అత్య‌వ‌స‌ర‌ - అనూహ్య రీతిలో... ఈ భేటీ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు వెంటనే హైదరాబాద్‌ కు బయలుదేరి రావాలని సీఎంఓ నుంచి మంత్రులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. లంగాణ భవన్‌ లో సీఎం కేసీఆర్‌ ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఏ పార్టీతో పొత్తులుండవని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ తిరిగి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ ఎస్ వందకుపైగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన చెప్పారు. ముందస్తు ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలని కేసీఆర్‌ అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం.

అయితే ఈ ప‌రిణామంపై మండలిలో ప్రతిపక్ష నేత - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు షబ్బీర్‌ అలీ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ఆ రాయి కేసీఆర్‌ ఎక్కడ విసురుతారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. అందుకే తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెబుతున్నామని సమాధానంగా చెప్పారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని, ఎన్నిక‌ల‌ను ఎదుర్కునేందుకు తాము రెడీగా ఉన్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.