Begin typing your search above and press return to search.

సమంత సరే.. సానియా మీద మాట్లాడవే షబ్బీర్?

By:  Tupaki Desk   |   15 Feb 2017 8:14 AM GMT
సమంత సరే.. సానియా మీద మాట్లాడవే షబ్బీర్?
X
మన నేతల తీరు కాస్త చిత్రంగా ఉంటుంది. సాఫ్ట్ గా ఉన్న వారిపై ఇష్టారాజ్యంగా ఎక్కేస్తుంటారు. మరి.. తాము ఎక్కే ఎక్కుడు.. తాము వినిపించే లాజిక్కు అందరికి అప్లై చేస్తారా? అంటే లేదని చెప్పాలి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యవహారమే దీనికి నిదర్శనం. చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటి సమంతను ఎంపిక చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై తాజాగా షబ్బీర్ అలీ మండిపడుతూ.. తెలంగాణలో ఇంతమంది ఉంటే.. ఎవరూ కనిపించలేదా? తమిళనాడుకు చెందిన సమంతను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నించారు.

నిజానికి ఈ తరహా వాదనలకు టీఆర్ ఎస్ నేతలకు పెట్టింది పేరు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రతి విషయంలోనూ ఇదే తరహా వాదనలు వినిపించేవారు. ప్రతి అంశంలోనూ తెలంగాణ కోణాన్ని వెతికేవారు. ఉద్యమ సమయం కావటం.. తెలంగాణ వారిని అన్ని విధాలుగా అణగదొక్కేస్తున్నారన్న ఫీలింగ్ నేపథ్యంలో.. టీఆర్ ఎస్ నేతలు వినిపించే వాదనకు స్పందన ఉండేది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెట్టేందుకు వారి తరహాలోనే భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు.

తాజాగా షబ్బీర్ ఈ తరహాలోనే తెలంగాణ అధికారపక్షంపై విమర్శల్ని సంధించారు. చేనేతకు సమంత బ్రాండ్ అంబాసిడర్ ఏమిటి? తెలంగాణలో మరెవరూ లేదా? అన్నది ఆయన ప్రశ్న. మరి..ఇలాంటి ప్రశ్నే.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలో ఆయన ఎందుకు చేయలేదన్నది ప్రశ్న. వాస్తవానికి సమంతకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఒక్కరూపాయి ఇస్తున్నట్లుగా ఎక్కడా వార్తలు రాలేదు.కానీ.. అదే సానియామీర్జాకు కోటి రూపాయిలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.

సమంతది తప్పు అయితే.. సానియాది మరింత తప్పు. ఎందుకంటే.. కొత్త రాష్ట్రానికి తనవంతు సహకారంగా ఉచితంగా బ్రాండ్అంబాసిడర్ గా ఉంటానని చెప్పి ఉండాల్సింది. ఆ మాట తర్వాత.. ప్రభుత్వం పారితోషికంగా ఇస్తున్న కోటి రూపాయిలకు చెల్లించాల్సిన సేవా పన్నుచెల్లించకుండా నోటీసులు ఇప్పించుకున్న దుస్థితి. సమంత మీద ఇంతెత్తు ఎగిరిపడుతున్న షబ్బీర్.. సానియామీర్జా విషయంలో ఎందుకుప్రశ్నించలేదు? సానియా హైదరాబాదీగానే చూడాల్సిందే తప్పించి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి కాదన్నది మర్చిపోకూడదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన తెలంగాణ వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా? అని సానియామీర్జాను ఎంపిక చేసిన సమయంలోనూ షబ్బీర్ ప్రశ్నిస్తే.. ఇప్పుడు సమంతను తప్పు పట్టటాన్ని స్వాగతించే వారు. కానీ.. అందుకు భిన్నంగా షబ్బీర్ వ్యవహరించటంతోనే అసలు ఇబ్బంది అంతా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/