Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లోకి కోదండ‌రాం..డిసైడ్ చేసేది ఈ పెద్దాయ‌న‌

By:  Tupaki Desk   |   18 Oct 2017 11:20 AM GMT
కాంగ్రెస్‌ లోకి కోదండ‌రాం..డిసైడ్ చేసేది ఈ పెద్దాయ‌న‌
X
తెలంగాణలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వ‌స్తున్న‌ట్లుంది. ఇప్ప‌టికే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేర‌డం ఖరారైపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ కు మ‌రో తీపిక‌బురు అందేలా ఉంది. తెలంగాణ జేఏసీ చైర్మ‌న్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కాంగ్రెస్‌ లో చేరనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ అంచ‌నాలు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వ‌స్తున్నాయి. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు నుంచి సైతం కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్‌ - శాసనమండలి కాంగ్రెస్‌ పక్షనేత మహ్మద్‌ షబ్బీర్‌ అలీ ఈ చ‌ర్చ‌కు కొత్త మ‌లుపు తిప్పారు.

నిజామాబాద్‌ జిల్లాలో విలేకరుల సమావేశంలో షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి కోదండ‌రాం రానున్నార‌ని ప్ర‌చారం త‌మ దృష్టికి సైతం వ‌చ్చింద‌న్నారు. ఈ విషయమై ఆంటోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని, సీఎం గాలి మాటలతో పాలన అస్తవ్యస్తంగా తయారైందని ష‌బ్బీర్ అలీ మండిప‌డ్డారు. మంత్రులు - ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. అవినీతి మూలాలు సీఎం కేసీఆర్‌ ఇంటి నుంచే మొదలయ్యాయని విమర్శించారు. దీనిపై సీఎం మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని, తెలంగాణ ఆడబిడ్డలకు నాసిరకం చీరలు పంపిణీ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎంపీ కవిత బతుకమ్మ చీరలు కట్టుకుని పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్తారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై జరిగే సమావేశాలకు ఎంపీ హాజరు కాకపోవడం ఆమెకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ష‌బ్బీర్ అలీ ఆన్నారు.

రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ష‌బ్బీర్ అలీ జోస్యం చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు - ఆస్పత్రులు - పాఠశాలల్లో ఖాళీల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, మైనార్టీ కార్పొరేషన్‌ లో రూ.5కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విడుదల చేయడం లేదని, రైతులకు ఇప్పటికీ రుణమాఫీ అమలు కావడం లేదని తెలిపారు. నిజామాబాద్‌ నగరంలో ఎంఐఎం కార్పొరేటర్లు పెండను కూడా అమ్ముకుంటున్నారని విమర్శించారు.