Begin typing your search above and press return to search.

వెబ్ సైట్ పెట్టి మరీ కేసీఆర్ మీద యుద్ధం

By:  Tupaki Desk   |   20 April 2016 4:59 AM GMT
వెబ్ సైట్ పెట్టి మరీ కేసీఆర్ మీద యుద్ధం
X
అంతకంతకూ బలోపేతం అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలువరించటం కోసం తెలంగాణ కాంగ్రెస్ విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఆయన్ను ఢీ కొట్టేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం సిద్ధంగా లేకుంటే.. మరోవైపు అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శించే నేతలూ ఉండటం గమనార్హం. కేసీఆర్ పై విమర్శలు చేసేందుకు.. ఆయనపై ఆరోపణలు సంధించేందుకు ఎప్పుడూ ఉత్సాహాన్ని ప్రదర్శించే ఎమ్మెల్సీ కమ్ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తాజా చేపట్టిన వైనం ఆసక్తికరంగా ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక హామీని అమలు చేయలేదంటూ ఆయన ఓ కొత్త తరహా పోరాటానికి తెర తీశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారని.. పవర్ లోకి వచ్చి 24 నెలలు అవుతున్నా.. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కనీస ప్రతిపాదనను ఈ రోజుకి సిద్ధం చేయలేదంటూ షబ్బీర్ మండిపడుతున్నారు.

ముస్లిం రిజర్వేషన్.ఇన్ పేరు మీద ఒక వెబ్ సైట్ ను స్టార్ట్ చేసిన షబ్బీర్.. కేసీఆర్ ఇచ్చిన హామీపై సరికొత్త పోరాటానికి తెర తీశారు. తమిళనాడులో ముస్లిం రిజర్వేషన్లు అమలు అవుతున్న తీరును ఈ వెబ్ సైట్ లో పేర్కొన్న షబ్బీర్.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని పేర్కొని.. హామీ అమలు విషయంలో ఇప్పటివరకూ ఏమీ చేయలేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. వెబ్ సైట్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచటం.. కేసీఆర్ వైఖరిని ప్రశ్నించటం.. ఆయనపై ఒత్తిడి పెంచాలన్నదే లక్ష్యంగా మొదలైన షబ్బీర్ ప్రయత్నం ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి.