Begin typing your search above and press return to search.

‘దిశ’ ఎన్ కౌంటర్ విచారణ.. షాకింగ్ మాట చెప్పిన షాద్ నగర్ ఏసీపీ

By:  Tupaki Desk   |   26 Oct 2021 3:55 AM GMT
‘దిశ’ ఎన్ కౌంటర్ విచారణ.. షాకింగ్ మాట చెప్పిన షాద్ నగర్ ఏసీపీ
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ‘దిశ’ అత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై ఏర్పాటైన సిర్పుర్కర్ కమిషన్ విచారణ వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో పలువురిని విచారించిన ఈ కమిషన్ కు తాజాగా అనూహ్యమైన అనుభవం ఎదురైంది. దీనికి కారణం.. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ మాటలేనని చెప్పాలి. ఎన్ కౌంటర్ పై జరిగిన విచారణకు హాజరైన ఆయన ఊహించని వాదనను వినిపించారు.

దిశ నిందితుల ఎన్ కౌంటరర్ అనంతరం తన మానసిక స్థితి బాగోలేదని.. ఈ కారణంగా వివరాల్ని సరిగా నమోదు చేయలేకపోయినట్లుగా అప్పట్లో షాద్ నగర్ ఏసీపీగా వ్యవహరిస్తున్న సురేందర్ వెల్లడించారు. నిందితుల్ని ఘటనాస్థలానికి తీసుకెళ్లినప్పుడు తమ ఆయుధాల్ని లాక్కొన్నారని.. కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరపటంతోనే తాము ఎదురుకాల్పులు జరిపినట్లుగా ఆయన పేర్కొన్నారు.

నిజానికి ఎన్ కౌంటర్ కేసును సురేందర్ ఇచ్చిన ఫిర్యాదుతోనే నమోదు చేశారు. అయితే.. సదరు ఫిర్యాదులోకానీ తర్వాత దాఖలుచేసిన అఫిడవిట్ లో కానీ నిందితులు మట్టి చల్లినట్లుగా.. కాల్పులు జరిపినట్లుగా పేర్కొనకపోవటాన్ని కమిషన్ ప్రశ్నించింది. అయితే.. ఎన్ కౌంటర్ తర్వాత తన మానసిక పరిస్థితి బాగోలేదని.. అందుకే వాటిని పేర్కొనలేదన్నారు.

ఎవరు మట్టి చల్లారు? ఎవరెవరి కళ్లలో మట్టి పడింది? ఎవరు కాల్పులు జరిపారు? అని కమిషన్ ప్రశ్నించగా.. చీకటిలో ఉండటంతో సరిగా చూడలేకపోయానని ఆయన పేర్కొన్నారు. నిందితుల్నిభయపెట్టే ఉద్దేశంతో కాల్పులు జరపమని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశానని.. టీంలో తొలుతలాల్ మదార్ కాల్పులు జరిపినట్లు చెప్పారు. తన టీంలోని వారిని రక్షించుకోవాల్సిసిన బాధ్యత ఉండటంతో శబ్ధం వస్తున్న దిశగా కాల్పులు జరపాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు విచారణకు హాజరైన వారి తీరుకు భిన్నంగా తాజా పోలీసు అధికారి మాటలు ఉండటం గమనార్హం. మరి.. దీనికి కమిషన్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.