Begin typing your search above and press return to search.

వైసీపీలో షాడో ఎంఎల్ఏలా ?

By:  Tupaki Desk   |   11 Oct 2020 11:50 AM GMT
వైసీపీలో షాడో ఎంఎల్ఏలా ?
X
అధికార వైసీపీలో అన్నీ నియోజకవర్గాల్లో షాడో ఎంఎల్ఏలు ఉన్నారా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలు చూసిన తర్వాత అందరికీ అనుమానం వస్తోంది. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడల్లా షాడో ఎంఎల్ఏలు గద్దల్లా వాలిపోతున్నట్లు మండిపోయారు. విజయనగరం జిల్లా నేతలతో ఆన్ లైన్ లో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలతో రెచ్చిపోయారు. అక్రమ వసూళ్ళకు పాల్పడుతు, నియోజకవర్గాల్లోని ప్రజలను పట్టి పీడిస్తున్నట్లు చేసిన ఆరోపణలు ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఎందుకంటే షాడో ఎంఎల్ఏలు భూముల ఆక్రమణకు, వసూళ్ళకు పాల్పడుతున్నారని, జనాలను పట్టి పీడిస్తున్నారని ఎక్కడా ఎవరు ఆరోపణలు చేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరి ఎంఎల్ఏలు ఏమి చేస్తున్నట్లు ?

గత పాలకులు ప్రగతిలో పోటి పడితే ఇఫ్పటి ప్రభుత్వం మాత్రం అన్నింటినీ విధ్వంసం చేస్తోందన్నారు. గత పాలకులు అంటే ఇందులో తనను కూడా కలుపుకునే చంద్రబాబు చెప్పుకున్నారు. విజయనగరం జిల్లాలో 55 శాతం మండలాల్లో జనాలు పంటలు వేసుకోలేకపోయారని మండిపోయారు. 20 మండలాల్లో తీవ్ర వర్షాభవ పరిస్ధితులు ఉన్నాయని వివరించారు. అక్టోబర్ లో 2వ వారం వచ్చేసిన కరువు మండలాల జాబితాను ప్రభుత్వం ప్రకటించలేదంటూ నిలదీశారు. బహుశా కరువు మండలాలు లేవని ప్రభుత్వం అనుకుంటోందేమో. అందుకనే ఇంకా ప్రకటించుండదు. లేకపోతే కసరత్తు జరుగుతోందేమో తెలీదు.

ఇక అశోక్ గజపతిరాజు మీద కోపంతో మాన్సాస్ ట్రస్టును ప్రభుత్వం నాశనం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇదే విషయమై మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు ఎదురుదుడికి చంద్రబాబు, అంశోక్ ఎందుకు సమాధానం ఇవ్వటం లేదో ? మాన్సాస్ ట్రస్టుకు సంచైత ఛైర్ పర్సన్ అయిన తర్వాతే అక్రమాలు, అవినీతి జరిగిపోతున్నట్లు చంద్రబాబు, అశోక్ ప్రతిరోజు చేస్తున్న గోల అందరికీ తెలిసిందే. అయితే నిర్ధిష్టంగా ఈ విషయంలో అవినీతి జరిగిందని కానీ అక్రమాలు జరిగాయని కానీ ఎక్కడా చెప్పటం లేదు. పైగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పని సంచైత రుజువు చేస్తోంది. ఇదే సమయంలో వాళ్ళ హయాంలో జరిగిన అవినీతిని సంచైత మాట్లాడుతుంటే మళ్ళీ ఇటువైపు నుండి సమాధానం ఉండటం లేదు.



వైద్యం అందకపోవటం, ఉపాధికోల్పోవటం, వ్యాపారాలు సాగకపోవటం, రైతులకు మద్దతు ధరలు లేకపోవటం తదితర సమస్యలపై ప్రజాభిప్రాయాలు తెలుసుకునేందుకే ఏపి ఫైట్స్ కరోనా వైరస్ అనే వెబ్ సైట్ పెట్టినట్లు చంద్రబాబు చెప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా చంద్రబాబు చెప్పిన సమస్యలు ఒక్క ఏపిలో మాత్రమే కాదు దేశమంతా ఉంది. పైగా టీడీపీ పెట్టిన వెబ్ సైట్ కు జనాలెవరు ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదనే ఫిర్యాదులు చేయలేదు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం చంద్రబాబు స్వయంగా విడుదల చేసిన గణాంకాల్లోనే స్పష్టమైంది. సరే ఏదేమైనా షాడో ఎంఎల్ఏలపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రభుత్వం కాస్త సీరియస్ గానే తీసుకోవాలి.