Begin typing your search above and press return to search.

ఆ గుండా దెబ్బకు ఆ సీఎం వణుకుతున్నాడట

By:  Tupaki Desk   |   13 Sep 2016 4:45 AM GMT
ఆ గుండా దెబ్బకు ఆ సీఎం వణుకుతున్నాడట
X
గుండారాజ్ గా అభివర్ణించే బీహార్ రాష్ట్రానికి సరికొత్త ఇమేజ్ తీసుకురావటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాత్రను తక్కువ చేసి చూపించలేరు. విపరీతమైన ప్రజాదరణ ఉన్న మోడీ లాంటి నేతతో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉన్న నాయకుడిగా.. బీజేపీతో తగువు పెట్టుకొని మరీ.. వారికి షాకిచ్చిన నేతగా గుర్తింపు పొందిన నితీశ్ తాజాగా ఒక గుండా దెబ్బకు వణుకుతున్నట్లుగా చెబుతున్నారు. పదేళ్ల నుంచి క్రైం రేటు తక్కువగా ఉండేలా చేయగలిగిన నితీశ్ తాజాగా మాత్రం తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు. ఎందుకిలా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ముఖ్యమంత్రికి సైతం ముచ్చమటలు పోయిస్తున్న ఆ గుండా ఎవరు? అన్నది మరో ప్రశ్న.

ఒక హత్య కేసులో జైలుకు వెళ్లి 13 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న షాబుద్దీన్ తాజాగా బెయిల్ మీద విడుదలయ్యాడు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావటంతోనే.. అదేదో ఘనకార్యం చేసినట్లుగా ఆర్జేడీ (లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ)కి చెందిన నేతలు.. కార్యకర్తలు అతనికి భారీ స్వాగతం పలకటమే కాదు.. మంత్రి కార్లలో అతడ్ని జైలు నుంచి సొంతూరుకు తీసుకెళ్లారు. దాదాపు 200 పైగా కార్లలో అతని కాన్వాయ్ ఓ రేంజ్లో సాగింది. అతగాడ్ని ఆపితే లేనిపోని గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో పోలీసులు టోల్ ప్లాజాలో పని చేసే సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వటంతో.. టోల్ ఫీ కట్టకుండానే దర్జాగా వెళ్లిపోయాడు.

ఇదంతా ఒక కత అయితే.. తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన షాబుద్దీన్ మరో బాంబు లాంటి వ్యాఖ్య చేశారు. బీహార్ కు నితీశ్ ముఖ్యమంత్రి కావొచ్చు కానీ తనకు మాత్రం లాలూనే అంటూ వ్యాఖ్యలు చేసిన అతగాడు.. తాను లాలూ మాటను తప్పించి ఎవరి మాటా విననంటూ తేల్చేశాడు. నితీశ్.. మధుకోడా లాంటి వారికి లాలూ రియల్ కింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన షాబుద్దీన్ గత చరిత్ర చూస్తే అతడెలాంటివాడో ఇట్టే అర్థమవుతుంది.

సీనియర్ జర్నలిస్ట్ ను హత్య చేసిన కేసులో 2004 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న షాబుద్దీన్ ఇప్పటికి నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఘన చరిత్ర ఉంది. ఆర్జేడీలో కీలకనేతగా ఉన్న అతడ్ని 2005లో నితీశ్ సీఎం అయ్యాక జైలుకు పంపిన వైనంపై అతడెంతో గుర్రుగా ఉన్నాడు. అతడిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడటంతో తన భార్యను బరిలోకి దింపి రిగ్గింగ్ చేయించి మరీ గెలిపించుకున్నాడు. జైల్లో ఉండే ఇంత కథ నడిపించిన అతగాడు ఇప్పుడు బయటకు రావటంతో ముఖ్యమంత్రి నితీశ్ వణుకుతున్నట్లుగా చెబుతున్నారు. జైలు నుంచి రావటం రావటంతోనే తనకు సీఎం లాలూనే అంటూ చేసిన ప్రకటన చూస్తేనే నితీశ్ కు అతగాడు ఇచ్చే విలువ ఏంటో అర్థమవుతుంది. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పటికీ లాలూ చేతిలోనే బీహార్ ప్రభుత్వ రిమోట్ ఉందన్న విషయాన్ని మర్చిపోలేం. ఈ నేపథ్యంలో షాబుద్దీన్ ఆరాచకాలకు నితీశ్ మౌనప్రేక్షకుడిగా ఉండాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఇంతకాలం నితీశ్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులన్నీ మటాష్ అయిపోవటం ఖాయమంటున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.