Begin typing your search above and press return to search.

భారత్ ను సెమీస్ చేర్చేందుకు ఐసీసీ తాపత్రయం.. ఆఫ్రిది అక్కసు

By:  Tupaki Desk   |   4 Nov 2022 12:30 PM GMT
భారత్ ను సెమీస్ చేర్చేందుకు ఐసీసీ తాపత్రయం.. ఆఫ్రిది అక్కసు
X
క్రికెట్ లో కమర్షియలిజం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటినుంచే మ్యాచ్ ఫలితాలపై అనుమానాలు మొదలయ్యాయి. డబ్బు ప్రభావం పెరిగేకొద్దీ ప్రొఫెషనలిజం మీద నీలినీడలు కమ్ముకోసాగాయి. అభిమాన జట్టు ఓడితే ఏదో తేడాగా చూడడం.., ప్రత్యర్థి గెలిస్తే తమ అవకాశాలు మెరుగ్గా ఉండే మ్యాచ్ ల్లో ఆ ప్రత్యర్థి ఓడితే.. తమను పైకి రాకుండా చేసేందుకు ఇలా చేసిందని భావించడం సర్వసాధారణంగా మారాయి. ఇక ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఇలాంటి అపోహలకు ఆస్కారం మరీ ఎక్కువవుతోంది. తాజాగా పాకిస్థాన్ ఆల్ రౌండర్, భారత్ కు బద్ధ శత్రవు అయిన షాహిద్ ఆఫ్రిది ఇలాంటి కామెంట్సే చేశాడు.

భారత్ గెలుపు మీద అనుమనాలు..

బుధవారం బంగ్లాదేశ్ పై టి20 ప్రపంచ కప్ లో టీమిండియా గెలుపొందింది. దీంతో పాయింట్ల సంఖ్య 6 కు పెరిగి సెమీ ఫైనల్ అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే, అంతకుముందు వర్షం కారణంగా అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. ఎట్టకేలకు 16 ఓవర్లకు మ్యాచ్ ను కుదించి బంగ్లాదేశ్ ను ఆడించారు. చివరి ఓవర్లో ఆ జట్టు 20 పరుగులు చేయలేక ఓటమి మూటగట్టుకుంది. అయితే దీనిపైనా బంగ్లా ఆటగాడు నూరుల్ హసన్ సాకులు వెదికాడు. చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేసిన అతడు.. కోహ్లి ఫేక్‌ ఫీల్డింగ్ గురించి ఆరోపణలు చేశాడు.

కాగా, బంగ్లాదేశ్ పై భారత్ గెలుపుతో పాకిస్థాన్ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. దీంతో ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్‌ను ఎలాగైనా సెమీస్‌లో ఆడించాలని ఐసీసీ కోరుకుందని, అందుకే పాక్‌, బంగ్లాదేశ్‌ జట్లతో జరిగిన మ్యాచుల్లో టీమ్‌ఇండియాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించాడు.

బంగ్లాదేశ్‌ - భారత్‌ మ్యాచ్‌ను ఓ సారి పరిశీలిస్తే.. వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్‌ చాలా చిత్తడిగా ఉంది. అయినప్పటికీ భారత్‌కు అనుకూలంగా ఐసీసీ వ్యవహరించింది. ఎలాగైనా భారత్‌ సెమీస్‌ చేర్చాలనేదే ఐసీసీ ఆలోచన. బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా వర్షం ఆగిపోగానే.. వెంటనే ప్రారంభించడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయి.

ఐసీసీ, భారత్ ఆడటం, తీవ్ర ఒత్తిళ్లు రావడం.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే లిటన్‌ దాస్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బంగ్లాదేశ్ కానీ వికెట్లు కోల్పోకపోతే తప్పకుండా గెలుస్తుందని ఆరు ఓవర్ల తర్వాత మేమంతా భావించాం. అయితే పరిస్థితులు కలిసి రాలేదు. అయినా బంగ్లా చాలా బాగా పోరాడింది. అలాగే భారత్-పాక్‌ మ్యాచ్‌ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించినవారికి తప్పనిసరిగా ఉత్తమ అంపైరింగ్‌ అవార్డులు దక్కుతాయి.'' అని అక్కసు వెళ్లగక్కాడు.

ఆడలేక మద్దెల మీద నెపం

టి20 ప్రపంచ కప్ లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్.. ఆపై జింబాబ్వే చేతిలోనూ పరాజయం పాలవడంతో సెమీస్ చేరడం చాలా సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు భారత్.. దక్షిణాఫ్రికా గెలిచి ఉంటే పాకిస్థాన్ కు సమీకరణాలు సులవయ్యేవి. పైగా గురువారం దక్షిణాఫ్రికాను ఆ జట్టు ఓడించింది. కానీ, భారత్ సఫారీలపై ఓడడంతో పరిస్థితి మారింది. దీంతోపాటు బంగ్లాదేశ్ పై టీమిండియా గెలవడం, తదుపరి-చివరి మ్యాచ్ జింబాబ్వే మీద కావడం.. అందులోనూ మన జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సెమీస్ కు టాప్ ర్యాంక్ తో చేరే వీలుంది. దీన్ని మనసులో పెట్టుకునే పాకిస్థాన్ ఏడుపంతా అని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.