Begin typing your search above and press return to search.

ఢిల్లీలో వైద్యం అంద‌క మాజీ ఎంపీ మేన‌కోడ‌లు మృత్యువాత‌

By:  Tupaki Desk   |   8 Jun 2020 11:50 AM GMT
ఢిల్లీలో వైద్యం అంద‌క మాజీ ఎంపీ మేన‌కోడ‌లు మృత్యువాత‌
X
వైర‌స్ విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలోని మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఢిల్లీలో అదుపు త‌ప్పింది. రోజుకు వేల‌ల్లో కేసులు న‌మోద‌వుతుండ‌డంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైర‌స్ తీవ్రంగా దాడి చేసింది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో ఓ మాజీ ఎంపీ మేన కోడ‌లు వైర‌స్‌తో పోరాడుతూ మృత్యువాత చెందింది. కేసులు అధిక‌మ‌వ‌డం.. బాధితుల‌కు వైద్యం అందించ‌డంలో ఆల‌స్య‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు సమయానికి ఐసీయూలో చికిత్స అందించ‌లేకపోయారు. దీంతో ఆమె మృతిచెందింది. ఆమె ఎవ‌రో కాదు ‌మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ మేనకోడలు ముమ్మ‌న్‌. ఈ సంద‌ర్భంగా షాహిద్ ట్విట్ట‌ర్‌లో వైద్యానికి ఏర్ప‌డిన అవ‌స్థ‌లు.. త‌న మేన‌కోడ‌లు ఎలా చ‌నిపోయిందో ట్విట్ట‌ర్‌లో వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన వైద్య సేవలు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ సంఘటన నిరూపించిందని ట్విట్టర్‌లో తెలిపారు. కొన్ని రోజులుగా ముమ్మ‌న్ తీవ్ర జ్వరంతో బాధ పడుతుండ‌గా.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డింది. దీంతో వెంట‌నే ఆమెను కుటుంబసభ్యులు ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. సమయానికి వెంటిలేటర్ అందకపోవడంతో ఆమె మృతిచెందారు. దీనిపై ఆ మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఆవేద‌న‌తో ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.

ప్ర‌భుత్వాలు ఎలాంటి వ్యవస్థను నడుపుతున్నార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయన ప్రశ్నించారు. ప్రజలను రక్షించడానికి ఆస్ప‌త్రులు పని చేయడం లేదని, దీనిపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.