Begin typing your search above and press return to search.

గుంటూరు రషీద్.. ధోనీకి సహచరుడు.. ఐపీఎల్ లో దుమ్మురేపితే మంచి భవిష్యత్

By:  Tupaki Desk   |   24 Dec 2022 10:57 AM GMT
గుంటూరు రషీద్.. ధోనీకి సహచరుడు.. ఐపీఎల్ లో దుమ్మురేపితే మంచి భవిష్యత్
X
నిరుడు జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ గుర్తుందా..? అప్పట్లో ఓ కుర్రాడి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతడు.. క్రికెట్ పై పిచ్చితో అండర్ 19 జాతీయ జట్టు స్థాయికి ఎదిగాడు. ఇందుకు అతడి తండ్రి కూడా చాలా కష్టపడ్డాడు. చివరకు కుర్రాడి కల నెరవేరింది. దీంతో ఈ విషయం మీడియాకు ఎక్కింది. ఇప్పుడదే కుర్రాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడనున్నాడు. అంటే.. గుంటూరు వీధుల నుంచి టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి డ్రస్సింగ్ రూమ్ పంచుకునే వరకు వెళ్లాడు.

మెండైన ప్రతిభకు.. దాన్ని చాటుకునే వేదిక చాలా అవసరం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు గుంటూరుకు చెందిన కుర్రాడు షేక్ రషీద్. శుక్రవారం ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో ఇతడిని చెన్నై కొనుక్కుంది. ప్రాథమిక ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. అండర్ 19 వైస్ కెప్టెన్ గుంటూరుకు చెందిన రషీద్.. ఈ ఏడాది ప్రపంచ కప్ లో పాల్గొన్న అండర్ 19 జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణించాడు.

వాస్తవానికి ప్రపంచ కప్ తర్వాత ఐపీఎల్ 22 వేలం జరిగింది. ఆ వేలంలో రషీద్ కు మంచి అవకాశం వస్తుందని భావించినా.. అప్పట్లో దక్కలేదు. కానీ, ఇప్పుడు చెన్నై వంటి జట్టులో చోటు దొరికింది. తానేమిటో రుజువు చేసుకున్న రషీద్.. ధోనీ ప్రాతినిధ్యం వహించే జట్టుకు ఆడనున్నాడు. అన్నిటికి మించి దిగ్గజ ఆటగాడితో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకునే అవకాశం అతడి సొంతమైంది. మినీ వేలంలో రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోవటంతో అతగాడి సుడి తిరిగిందని.. ఆటలో అతడు చూపించే ప్రదర్శన.. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు తలుపుతట్టటం ఖాయమంటున్నారు. చాంపియన్ గా నిలవడంలో కీలకం పద్దెనిమిదేళ్ల రషీద్.. తొమ్మిదేళ్లకే అండర్ 14 క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు.

అండర్ 19 ప్రపంచ జట్టుకు ఎంపిక కావటంతో అతడి ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యాభై పరుగులు చేసి మన జట్టు చాంపియన్ గా నిలవడంలో కీలక భూమిక పోషించాడు. ఆ టోర్నీలో మొత్తం 201 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో సరైన బ్రేక్ రావాల్సి ఉంది. అదే జరిగితే వెలుగు వెలుగుతాడన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎలాగూ ఆంధ్ర రంజీ జట్టులో నిలకడైన బ్యాట్స్ మన్ అవసరం. కాబట్టి రషీద్ కు త్వరగానే చాన్స్ దొరుకుతుంది. ఇలాంటి వేళలో చెన్నై సూపర్ కింగ్స్ లోకి తాజా వేలంలో తీసుకోవటం ద్వారా అతని ఫ్యూచర్ కు అవసరమైన కీలక టర్న్ వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది.

మినీ వేలంలో తెలుగోళ్లు ఇలా..

ఐపీఎల్ మినీ వేలంలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లలో కొంతమందిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ (కనీస ధర రూ.20 లక్షలు)ను గుజరాత్‌ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. భరత్‌ కొన్నేళ్లుగా దేశవాళీ టోర్నీల్లో, భారత్‌- ఎ తరపున నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ను చెన్నై కనీస ధర రూ.20 లక్షలకు దక్కించుకుంది. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శనతో రషీద్‌ వెలుగులోకి వచ్చాడు. ఆంధ్ర తరపున ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌- ఎ క్రికెట్లో అరంగేట్రం చేసి సత్తాచాటుతున్నాడు.

ఇప్పుడు దిగ్గజ క్రికెటర్‌ ధోనితో కలిసి డ్రెస్సింగ్‌ గది పంచుకోవడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరో ఆంధ్ర ఆటగాడు నితీష్‌ కుమార్‌ను సన్‌రైజర్స్‌ కనీస ధర రూ.20 లక్షలకు కైవసం చేసుకుంది. ఈ విశాఖపట్నం కుర్రాడు దేశవాళీ టోర్నీల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. హైదరాబాద్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ భగత్‌ వర్మను కనీస ధర రూ.20 లక్షలకు చెన్నై తీసుకుంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు మెగా వేలంలోనూ అతణ్ని చెన్నై కొనుగోలు చేసింది. కానీ మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ జట్టులోకి తీసుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.