Begin typing your search above and press return to search.

మంత్రి బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌న‌...వైర‌ల్!

By:  Tupaki Desk   |   8 Oct 2018 2:12 PM GMT
మంత్రి బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌న‌...వైర‌ల్!
X
2014లో దేశ‌ప్ర‌ధానిగా మోదీ ప‌ద‌వి చేప‌ట్టిన అనంత‌రం `స్వ‌చ్ఛ భార‌త్`కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోని గ్రామాలు - ప‌ట్ట‌ణాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని....బ‌హిరంగా మ‌ల - మూత్ర‌ విస‌ర్జ‌న ర‌హిత దేశంగా భార‌త్ ను మార్చాల‌ని పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీలు - పొలిటిషియ‌న్స్ వ‌ర‌కు స్వ‌చ్ఛ భార‌త్ కోసం త‌మ వంతు కృషి చేస్తున్నారు. అయితే, కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కులు మాత్రం ఆ ఆశ‌యానికి తూట్లు పొడుస్తున్నారు. తాజాగా, బీజేపీకి చెందిన ఓ మంత్రి...బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌న చేశారు. అంతేకాకుండా, తాను చేసిన ప‌నిని నిస్సిగ్గుగా స‌మ‌ర్థించుకున్నారు. ప్ర‌స్తుతం ఆ అమాత్యుల వారి బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఓ వైపు `స్వచ్ఛభారత్‌` ఉద్యమాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ నానా తిప్ప‌లు ప‌డుతోంటే...కొంద‌రు బీజేపీ నేత‌లు మాత్రం ఆ నినాదాన్ని అభాసుపాలు చేస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన బీజేపీ మంత్రి శంభూ సింగ్‌ ఖేటసర్ ...ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అజ్మీర్ లో ప‌ర్య‌టిస్తూ బహిరంగ మూత్ర విసర్జన చేశారు. సాక్ష్యాత్తూ రాజ‌స్థాన్ సీఎం వ‌సుంధ‌ర రాజే పోస్ట‌ర్ అంటించిన గోడ ద‌గ్గ‌రే ఆ ఘ‌న‌కార్యం చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. ఆ మంత్రి గారి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో, తాను చేసిన ప‌నికి అమాత్యుల వారు వింత వివ‌ర‌ణ ఇస్తూ త‌న‌ను తాను స‌మ‌ర్థించుకున్నారు. బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌న‌ పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమని అన్నారు. బహిరంగ మ‌ల‌ విసర్జన చేయ‌డం స‌రికాద‌ని, కానీ, బ‌హిరంగ మూత్ర విసర్జన చేయడం సమస్య కాద‌ని అన్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో బ‌హిరంగ మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవని స‌మ‌ర్థించుకున్నారు. దీంతో, ఆ పాడు ప‌ని చేయ‌డ‌మే కాకుండా దానిని నిస్సిగ్గుగా స‌మ‌ర్థించుకుంటోన్న శంభూపై నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రధాని ఆశయాలకు సొంత పార్టీ మంత్రులే తూట్లు పొడుస్తున్నార‌ని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో కూడా ఓ బీజేపీ నేత బ‌హిరంగ ప్రదేశంలో మూత్ర విస‌ర్జ‌న చేసిన ఫొటోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.