Begin typing your search above and press return to search.

ఘోర అవమానం.. ప్రధాని మమ్మల్ని మాట్లాడనివ్వలేదు: మోడీ పై దీదీ ఆరోపణ

By:  Tupaki Desk   |   20 May 2021 11:30 AM GMT
ఘోర అవమానం.. ప్రధాని మమ్మల్ని మాట్లాడనివ్వలేదు: మోడీ పై దీదీ ఆరోపణ
X
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీ పై ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి పరిస్థితులపై చర్చించేందుకు ఈ మద్యే సీఎంలతో నిర్వహించిన సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొంతమంది బీజేపీ సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఫెడరల్ స్పూర్తికి ప్రధాని విఘాతం కలిగిస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రులను అవమానిస్తున్నారని విమర్శించారు. తమను సమావేశానికి రమ్మని పిలిచి కూడా తమతో మాట్లాడలేదని, తమను మాట్లాడనివ్వలేదని అన్నారు.

అది తమకు అవమానభారంగా ఉందన్నారు. సమావేశంలో భాగంగా వ్యాక్సిన్ల గురించిగానీ, రెమ్ డెసివిర్ మందులపైగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించీ వివరాలు అడగలేదన్నారు. తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు తగ్గాయన్నారని, కానీ, ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ప్రధాని మోదీకి అభద్రతా భావం ఎక్కువని, అందుకే తమ మాటలను ఆయన వినట్లేదని మండిపడ్డారు. మోదీతో సమావేశం వన్ నేషన్-ఆల్ హ్యుమిలియేషన్ (ఒకే దేశం-అందరినీ అవమానపర్చడం)లా ఉంది అంటూ మమతా బెనర్జీ విమర్శలు కురిపించారు. తానేమీ అందరి ముఖ్యమంత్రుల తరుపున వకల్తా పుచ్చుకుని మాట్లాడట్లేదని మమతా బెనర్జీ అన్నారు. కానీ జరుగుతున్నదేమిటీ ,ప్రధాని మోదీ నియంతృత్వం కాదా అని ప్రశ్నించారు. బెంగాల్‌ లో కరోనా వ్యాక్సిన్ల కొరతపై తాను మోదీతో మాట్లాడాలనుకున్నానని, కానీ ఆ అవకాశం లేకుండా చేశారని అన్నారు.