Begin typing your search above and press return to search.

శని సింగనాపూర్ ఇష్యూ క్లోజ్

By:  Tupaki Desk   |   9 April 2016 11:17 AM IST
శని సింగనాపూర్ ఇష్యూ క్లోజ్
X
వివాదాల మీద వివాదాలు తెర మీదకు రావటమే కానీ.. వాటికో పరిష్కారం దొరికి.. ఇష్యూ క్లోజ్ కావటం చాలా తక్కువగా ఉండటం చూస్తున్నాం. రోజులు గడిచే కొద్దీ వివాదాలు పెరగటమే కానీ తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. అలాంటి వాటికి భిన్నంగా కొద్ది నెలలుగా సాగుతున్న శని సింగనాపూర్ ఆలయ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఈ దేవాలయం గర్భగుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయంపై కొద్ది నెలల కిందట నుంచి మహిళలు కొందరు కలిసి ‘భూమాతా బ్రిగేడ్’ పేరిట నిరసనలు నిర్వహిస్తూ.. గర్భగుడిలో ప్రవేశం కోసం పోరాడుతున్నారు. వీరి పోరాటానికి దన్నుగా కోర్టు ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే.

అయితే.. కోర్టు నిర్ణయాన్ని అమలు చేయటానికి స్థానికులు అడ్డుకోవటం ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో దశాబ్దాలుగా సాగుతున్న నిషేధానికి చెక్ చెబుతూ తాజాగా ఆలయ ధర్మకర్తల మండలి భేటీ అయి మహిళలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించాయి. దీంతో కొంతకాలంగా నడుస్తున్న ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లైంది. గర్భగుడిలో ప్రవేశం కోసం పోరాడిన తృప్తిదేశాయ్ తాజా పరిణామం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యమైనా సరైన నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. కొద్దికాలంగా మీడియాలో ప్రముఖంగా కనిపించిన శని సింగనాపూర్ వివాదం ఇకపై కనిపించనట్లే.