Begin typing your search above and press return to search.

సాయిబాబాను తరిమికొడుతున్న హనుమాన్

By:  Tupaki Desk   |   2 Nov 2015 7:34 AM GMT
సాయిబాబాను తరిమికొడుతున్న హనుమాన్
X
జ్యోతిర్మఠం - ద్వారకపీఠాల శంకరాచార్య స్వామీ స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని షిరిడీ సాయి ఆలయాలను కూల్చి అక్కడ హనుమంతుడి ఆలయాలు నిర్మిస్తామని అన్నారు. తన కలలో హనుమాన్ కనిపించారని... ఆయన సాయిబాబాను తరిమికొడుతున్నట్లు కనిపించిందని చెబుతూ ఆయన దాన్ని ప్రతిబింబించేలా ఓ చిత్రాన్ని విడుదల చేశారు. భోపాల్ ఆయన ఈ చిత్రాన్ని విడుదల చేయగా దేశవ్యాప్తంగా సాయిభక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వివాదం చెలరేగుతోంది.

ఆంజనేయుడు చెట్టును పెకిలించి కొట్టడానికి వస్తుండగా సాయిబాబా పరుగులు తీస్తున్నట్లుగా ఆ చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా స్వరూపానంద మాట్లాడుతూ సాయి అసలు దేవుడే కాదని అన్నట్లు సమాచారం. ''సాయి అసలు పేరు చాంద్ మియా... ఆయన చనిపోయి చాలాకాలమైంది.. ఆయన దేవుడేమీ కాదు. హిందూ దేవుళ్లను మాయం చేసే కుట్రలో ఈయన్ను తీసుకొచ్చారు.. ఈ చిత్రాలను దేశమంతా పంచిపెట్టండి" అని స్వరూపానంద తన శిష్యులకు సూచించినట్లు చెబుతున్నారు.

అయితే... ఆరెస్సెస్ మాత్రం స్వరూపానంద వ్యాఖ్యలను ఖండించింది. సాయి తాను దేవుడినని ఏనాడూ చెప్పుకోలేదని.. సంఘ్ లోనూ సాయి భక్తులున్నారని... స్వరూపానంద వ్యాఖ్యల వల్ల సాయిభక్తులు బాధపడుతున్నారని ఆరెస్సెస్ నేత మన్మోహన్ వైద్య అంటున్నారు. దీనిపై స్వరూపానంద తీవ్రంగా మండిపడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించలేకపోయిన ఆరెస్సెస్ కు ఈ విషయంలో మాట్లాడే హక్కే లేదని... సాయి ట్రస్టు పేరిట షిరిడీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని అన్నారు. కాగా స్వరూపానంద సరస్వతి ఇంతకుముందు కూడా సాయిబాబాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు.