Begin typing your search above and press return to search.

ఏపీలో రాజకీయం కోసమే శాంతకుమారి ఎంపిక?

By:  Tupaki Desk   |   12 Jan 2023 5:37 AM GMT
ఏపీలో రాజకీయం కోసమే శాంతకుమారి ఎంపిక?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలు చాలా సిత్రంగా ఉంటాయి. అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా సోమేశ్ కుమార్ స్థానంలో శాంతికుమారిని ఎంపిక చేయటం ద్వారా చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశారు. కేసీఆర్ కున్న ఇమేజ్ ప్రకారం చూసినప్పుడు.. కీలకస్థానాల్లో మహిళలకు అవకాశం ఇవ్వటానికి ఆయన సుతారం ఇష్టపడరన్న ప్రచారం ఒకటి ఉంది. దీనికి తగ్గట్లే.. ఆయన ఏళ్లకు ఏళ్లు తన మంత్రివర్గంలో మహిళకు అవకాశం ఇవ్వకుండా సర్కారు రథాన్ని నడిపారు. నిజానికి.. ఇలాంటి పనే మరే ముఖ్యమంత్రి అయినా చేసి ఉంటే తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొనే వారు.

అలాంటి కేసీఆర్.. ఇవాల్టి రోజున సీఎస్ గా శాంతికుమారిని ఎంపిక చేయటం అంటే మాటలు కాదు. చాలా లోతైన కసరత్తు చేసిన తర్వాత మాత్రమే ఆమెను ఎంపిక చేశారన్న మాట వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే తాజాగా ఆసక్తికర కోణం రాజకీయ వర్గాల్లో చర్చగా నడుస్తోంది. శాంతికుమారి నియామకం వెనుక ఏపీ రాజకీయాన్ని పరిగణలోకి తీసుకొని ఆమె నియామకం జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.

వాస్తవానికి సీఎస్ గా సోమేశ్ కుమార్ స్థానంలో ఎవరిని నియమిస్తారన్న సందర్భంలో శాంతికుమారి పేరు వినిపించినా.. ాప్షన్లలో ఆమె చివరి పేరుగా నిలిచింది. అలాంటిది ఆమే సీఎస్ గా నియామకం కావటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి.. శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఎందుకు ఎంపిక చేసినట్లు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. శాంతికుమారి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావటం.. త్వరలో ఏపీలో పార్టీని ప్రారంభించి.. అక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని తపిస్తున్న కేసీఆర్.. అక్కడి కాపు ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ సీఎస్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణిని ఎంపిక చేస్తే.. ఏపీలోని కాపులు కేసీఆర్ కు ఓట్లు వేస్తారా? అన్న ప్రశ్న కొందరిలో తలెత్తొచ్చు. కానీ.. లోతుగా చూస్తే.. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ శాఖకు సంబంధించిన ఇప్పటివరకు ఎంపిక చేసిన నేతల్లో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావటం తెలిసిందే. నిజానికి కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ శాఖకు సంబంధించిన వివరాల్ని వెల్లడించిన తర్వాత.. కాపులను లక్ష్యంగా చేసుకొని పార్టీని ఏపీలో ప్రారంభిస్తున్నారా? అన్న ప్రచారం సాగింది.

ఈ నియామకాలన్నీ కూడా టీడీపీ - జనసేన పార్టీలకు దెబ్బ తగిలేలా కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా శాంతికుమారి నియామకాన్ని చూసినప్పుడు.. కాపులకు పెద్దపీట వేసే పార్టీగా బీఆర్ఎస్ ఇమేజ్ ఉండేలా కేసీఆర్ ప్లానింగ్ జరుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే శాంతికుమారిని ఎంపిక చేశారంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు కొన్నిచోటు చేసుకున్నాయి.

తెలంగాణరాష్ట్ర సీఎస్ గా శాంతికుమారిని ఎంపిక చేసిన వెంటనే.. బీఆర్ఎస్ ఏపీ శాఖకు చెందిన నేతలు హర్షం వ్యక్తం చేయటాన్ని అండర్ లైన్ చేసి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. తాను చేసే ప్రతి పనిని దీర్ఘంగా ఆలోచించి.. లోతుగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అలవాటున్న కేసీఆర్.. శాంతికుమారిని సీఎస్ గా ఎంపిక చేయటంలోనూ తనదైన లెక్కలు ఉన్నాయని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.