Begin typing your search above and press return to search.

శాంతికుటీరంపై ల‌క్ష్మీపార్వతి మాట ఇదే!

By:  Tupaki Desk   |   6 Nov 2017 6:59 AM GMT
శాంతికుటీరంపై ల‌క్ష్మీపార్వతి మాట ఇదే!
X
రాజ‌కీయాల్లో అందులోనూ తెలుగునాట ఎన్టీఆర్ అనే మూడు అక్ష‌రాల‌కు ఎంతో చ‌రిత్ర ఉంది. వెండితెర వేలుపుగా కొన‌సాగుతూ.. నాటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు నంద‌మూరి తార‌క రామారావు. ఆనాడు ఢిల్లీ నుంచి రాష్ట్రంలో సాగుతున్న రిమోట్ పాల‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ తెలుగుజాతి పౌరుషమే నినాదంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారాయ‌న‌. వ‌చ్చీరావ‌డంతోనే తెలుగుజాతి ఘ‌న‌కీర్తిని హ‌స్తిన‌కు చాటి చెప్పాల‌నే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెల‌ల కాలంలోనే కాంగ్రెస్‌ ను ఘోరంగా ఓడించి అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టారు.

ఆ త‌ర్వాత ఎన్నో ప‌థ‌కాలు తీసుకువ‌చ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు వ‌య‌సుతో సంబంధం లేకుండా.. అన్న‌గా మారిపోయారు ఎన్టీఆర్‌. ఆ త‌ర్వాత అనేకానేక మ‌లుపులు తిరిగిన రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఆయ‌న ఓడిపోయి ఉండ‌వ‌చ్చు. కానీ తెలుగు ప్ర‌జ‌ల హ‌ృద‌యాల్లో ఆయ‌నెప్పుడూ విజేతే. అయితే ఇటీవ‌ల కాలంలో మ‌రోసారి అన్న ఎన్టీఆర్ వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న ఆస్తుల‌ను వార‌సులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అవి శిథిలావ‌స్థ‌కు చేరాయ‌న్న‌ది వాటి సారాంశం. చెన్నైలో అన్న‌గారు నివ‌సించిన ఇల్లైతే అమ్మ‌కానికి పెట్టార‌ని తెలిసి తెలుగు ప్ర‌జ‌ల గుండె త‌ల్ల‌డిల్లింది.

అదే విధంగా ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానంలో కీల‌క‌పాత్ర పోషించిన గండిపేట శాంతి కుటీరంపై వ‌చ్చిన వార్త‌లూ అభిమానుల‌కు ఆవేద‌న క‌లిగించాయి. రాజకీయాల్లోకి వచ్చాక హైదరాబాద్‌ శివార్లలో ఆయన ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న గండిపేట శాంతి కుటీరానికీ అంతే ప్రాశస్త్యం ఉంది. గండిపేట కుటీరంలోని పచ్చటి చెట్ల మధ్య ఎన్టీఆర్‌ పచార్లు చేసేవారు. నిత్యం గండిపేట చెరువులో స్నానం చేసి నేరుగా కుటీరానికి వచ్చేవారు. అయితే ప్రస్తుతం గండిపేట కుటీరం కూడా కళ తప్పిందని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌ల‌పై ఎన్టీఆర్ సతీమణి - వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ కుటీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని తెలిపారు. తన భర్తకు సంబంధించి తనకు మిగిలిన ఆస్తి గండిపేటలోని కుటీరం మాత్రమేనని స్ప‌ష్టంచేశారు. ఆయన గుర్తుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. గండిపేట కుటీరాన్ని అమ్మే ప్రసక్తే లేదని, లీజుకు కూడా ఇవ్వబోనని తేల్చిచెప్పారు. గండిపేట వచ్చి ఎవరైనా సరే ఎన్టీఆర్ కుటీరాన్ని చూడవచ్చని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పారు.