Begin typing your search above and press return to search.

రాహుల్ కు `పవార్` ఫుల్ లెసన్స్ ఇవే

By:  Tupaki Desk   |   29 July 2020 5:30 PM GMT
రాహుల్ కు `పవార్` ఫుల్ లెసన్స్ ఇవే
X
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, దేశ వ్యాప్తంగా రాహుల్ పర్యటించి కార్యకర్తలు, నాయకులను రాహుల్ కలుసుకోవాలని శరద్ పవార్ సూచించారు. గతంలో రాహుల్ గాంధీ ఇదే తరహాలో దేశవ్యాప్త పర్యటన చేశారని, ఇపుడు మరోమారు అదే పని చేయాలని అన్నారు. ఇక, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యక్తిగత విమర్శలు చేయడంపైనా శరద్ పవార్ రాహుల్ కు కీలకమైన సూచనలు చేశారు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే...రాహుల్ విశ్వసనీయత తగ్గిపోయే అవకాశం ఉంటుందని, ఈ పరిస్థితిని రాహుల్ నివారించాలని శరద్ పవార్ హితవు పలికారు. రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కేడర్ అంగీకరిస్తుందని, కాంగ్రెస్ కు గాంధీ ఫ్యామిలీనే గాడ్ ఫాదర్ అని చెప్పారు.

వాస్తవానికి ప్రధాని మోడీపై ఉన్న కొద్దో గొప్పో వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ...రాహుల్ గాంధీ విఫలమవుతున్నారు. ఎంతసేపటికీ మోడీని టార్గెట్ చేస్తున్న రాహుల్...ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా....రాబోయే ఎన్నికల లో బీజేపీని గద్దె దింపే గోల్డెన్ చాన్స్ వదులుకుంటున్నారు. మోడీని సాగనంపే సువర్ణావకాశాన్ని రాహుల్ చేజేతులా వదులుకుంటున్నాడని శరద్ పవార్ ఆవేదన చెందినట్లున్నారు. సాలిడ్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉన్నా....సోనియా గాంధీ రూపంలో కొండంత అనుభవం అండగా ఉన్నా రాహుల్ ఎందుకు ఎదగలేకపోతున్నారని పవార్ యోచించినట్లున్నారు. వాస్తవానికి రాహుల్ కు పవార్ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, సోనియా గాంధీ చెబుతున్నా....ఆ విషయం రాహుల్ కు సరిగ్గా కన్వే కావడం లేదు.

అయితే, శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్లు....కొన్ని కొన్ని సార్లు దారిన పోయే దానయ్యో...ఏదో అపరిచితుడో..కాస్త సుపరిచితుడో చెప్పిన సూచనలు పాటించి బాగుపడ్డవారు చాలామంది ఉన్నారు. అటువంటిది, రాజకీయాల్లో 40 ఏళ్ల అపార అనుభవమున్న శరద్ పవార్ వంటి రాజకీయ ఉద్దండుడు...తన కళ్ల ముందే ఎదగడానికి ఇబ్బంది పడుతోన్న రాహుల్ కు అద్భుతమైన సలహాలిచ్చారు. తన జీవిత పాఠాలను రంగరించి రాహుల్ కు ప్రాక్టికల్ గా పనికి వచ్చే సలహాలిచ్చారు పవార్. శరద్ పవార్ ఇచ్చిన పవర్ ఫుల్ సలహాలను రాహుల్ తు.చ తప్పకుండా పాటిస్తే....రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి తప్పక మేలు జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, పవార్ సూచనలను రాహుల్ ఎంతవరకు పాటిస్తారో వేచి చూడాలి.