Begin typing your search above and press return to search.

శరద్ పవార్.. సర్కార్ రద్దు.. వాంఖడేలో క్రికెట్ మ్యాచ్

By:  Tupaki Desk   |   25 April 2022 12:30 PM GMT
శరద్ పవార్.. సర్కార్ రద్దు.. వాంఖడేలో క్రికెట్ మ్యాచ్
X
‘‘మహారాష్ట్రలో కనీసం హనుమాన్ చాలీసా పఠించే స్వేచ్ఛ లేదు. రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రపతి పాలన కోరుతున్నారు. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్య యుతంగా పదవిలోకి రావాలని కోరుకుంటోంది’’ అంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ చేసిన విమర్శలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అందుకుతగిన సమాధానం ఇచ్చారు. 2019లో బీజేపీకి అధికారం చేజారిన తర్వాత కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు. సోమవారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవార్‌.. అక్కడ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో మత సంబంధ ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్ల అంశంపై మహా వికాస్‌ అఘాడీ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఈ భేటీతో ఏదైనా ఫలితం వస్తే తానెంతో సంతోషిస్తానని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ కొందరు విపక్ష నేతలు వ్యాఖ్యలపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని చెబుతూ దీటుగా బదులిచ్చారు.

లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసాపై మహా దుమారం

మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దం పరిమితంగా ఉండాలంటూ మొన్నటిదాకా రాజ్ థాక్రే వివాదం రేపగా.. ప్రస్తుతం మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ఎదుట ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు హనుమాన్ చాలీసా పఠనం చేస్తామనడం వివాదమైంది. మత ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా పఠనం వంటి వ్యవహారాలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ భాజపాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయాక కొందరు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

1980లో ఏంజరిగిందంటే..

అత్యంత చిన్న వయసు (38)లో మహారాష్ట్ర కు సీఎం అయిన చరిత్ర శరద్ పవార్ది. 1978లో ఆయన ఈ ఘనత సాధించారు. అయితే తర్వాత ఎదురైన పరిణామాలను వివరించారు. ‘మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు కొత్త కాదు. అందరూ నాలా ఉండరు. 1980లో రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు నాకు ఆ విషయం చెప్పారు. అప్పుడు నాతో పాటు నా స్నేహితులు తక్షణమే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేసే వేరే చోటకు వెళ్లిపోయాం. ఆ మరుసటి రోజే అందరం కలిసి వాంఖడే మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌కు చూసేందుకు వెళ్లాం.

ఆ రోజంతా ఎంతో ఎంజాయ్‌ చేశాం’’ అని పవార్‌ చెప్పుకొచ్చారు. ‘‘అధికారం వస్తుంది.. పోతుంది.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత కాలంగా కొందరు వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. నేను వాళ్లను నిందించడం లేదు.. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి తిరిగి వస్తామని వారు అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అందుకే ఈ ఆందోళనంతా’’ అని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘‘మధ్యంతరం’’ ఫలితం చూశారుగా!

ముంబయిలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల నేపథ్యంలో భాజపా ప్రతినిధులు కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలవడంపైనా పవార్‌ స్పందించారు. కొందరు ఆతృత కలిగిన వ్యక్తులు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారి అవకాశాలను అన్వేషించొచ్చని వ్యాఖ్యానించారు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ ఎప్పట్నుంచో బెదిరిస్తున్నారనీ.. కానీ ఫలితం లేకపోయిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల పరిస్థితి గనక వస్తే.. ఇటీవల కొల్హాపూర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఏమైందో చూశాం కదా.. అందువల్ల అంతవరకు వెళ్లరని తాను అనుకొంటున్నానన్నారు. ఇటీవల కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థి జయశ్రీ జాదవ్‌ భాజపా అభ్యర్థి సత్యజీత్‌ కదమ్‌పై 18వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.