Begin typing your search above and press return to search.

మ‌హా ట్విస్టులో కొత్త విష‌యాలు బ‌య‌ట పెట్టిన శ‌ర‌ద్ ప‌వార్‌

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:29 PM GMT
మ‌హా ట్విస్టులో కొత్త విష‌యాలు బ‌య‌ట పెట్టిన శ‌ర‌ద్ ప‌వార్‌
X
ఎట్ట‌కేల‌కు మ‌హారాష్ట్ర రాజ‌కీయం శివ‌సేన సీఎం పీఠం ద‌క్కించుకోవడంతో సుఖాంత‌మైంది. ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి మ‌హారాష్ట్ర రాజ‌కీయంలో ఎన్నో ఉత్కంఠ ప‌రిణామాలు, ట్విస్టులు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ మాట్లాడుతూ బీజేపీకి మ‌ద్ద‌తు అంశంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ త‌న‌తో మాట్లాడార‌ని ప్ర‌క‌టించి పెద్ద సంచ‌ల‌న‌మే రేపారు. ఈ క్ర‌మంలోనే ప‌రిస్థితులు అన్ని కుద‌రుకుంటోన్న టైంలో శ‌ర‌ద్ ప‌వార్ మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఈ సారి అజిత్ ప‌వార్ అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. బుధ‌వారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఈ మ‌హాట్విస్టులో జ‌రిగిన కొన్ని విష‌యాలు ఇప్పుడు బ‌య‌ట పెట్టారు.

మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ మంతనాలు జరుపుతున్న విష‌యం త‌న‌కు ముందే తెలుస‌ని శ‌ర‌ద్ ప‌వార్ చెప్పారు. అయితే వీరిద్ద‌రి మంతనాలు ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు వెళ‌తాయ‌ని మాత్రం తాను అనుకోలేద‌న్నారు. ఇక ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌య‌మై ఎన్సీపీ కాంగ్రెస్‌, శివ‌సేన‌తో పాటు బీజేపీతోనూ చ‌ర్చ‌లు జ‌రిపిన మాట వాస్త‌వ‌మే అని చెప్పారు.

ఒకానొక ద‌శ‌లో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌య‌మై ఎన్సీపీ - కాంగ్రెస్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని... కాంగ్రెస్ నేత‌ల‌పై అజిత్ ప‌వార్ అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని కూడా శ‌ర‌ద్ తెలిపారు. ఇక కాంగ్రెస్ నేత‌ల తీరుతోనే అజిత్ ప‌వార్ తిరుగుబాటు చేసి ఉండ‌వ‌చ్చ‌న్న సందేహం కూడా ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఈ గొడ‌వ‌లో కాంగ్రెస్ త‌న స్థాయికి మించి పోర్ట్ ఫోలియోలు కోర‌డంతో తాను సైతం ఆ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అలాగే అజిత్ ప‌వార్ అప్ప‌టిక‌ప్పుడు ఉప మ‌ఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం వెన‌క త‌న హ‌స్తం ఉందంటూ జ‌రిగిన ప్ర‌చారాన్ని శ‌ర‌ద్ ప‌వార్ ఖండించారు. ఫ‌డ్న‌వీస్‌తో అజిత్ ట‌చ్‌లో ఉన్న మాట మాత్రం వాస్త‌వమే అన్నారు. అలాంటిది అజిత్ ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం చూసి తానే షాక్ అయ్యాన‌న్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో అజిత్ ప‌వార్‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ల‌భిస్తుంద‌న్న ఊహాగానాల‌పై ఆయ‌న మాట్లాడుతూ అజిత్‌కు ఆ ప‌ద‌వి ఇవ్వ‌డంపై ఎవ్వ‌రికి వ్య‌తిరేక‌త లేద‌న్నారు.