Begin typing your search above and press return to search.

శరద్ పవార్ : తండ్రి బాటలో జగన్ నడిస్తే...?

By:  Tupaki Desk   |   14 Jun 2022 8:33 AM GMT
శరద్ పవార్ : తండ్రి బాటలో జగన్ నడిస్తే...?
X
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు ఈసారి సంచలనం సృష్టించనున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో 49 శాతం ఓట్లు మాత్రమే ఎన్డీయే వద్ద ఉన్నాయి. ఆ పార్టీకి అన్నాడీఎంకే, బిజీ జనతాదళ్, వైసీపీ వంటి పార్టీల మద్దతు సమకూరితే బొటాబొటీగా తన రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకుంటుంది.

అదే టైమ్ లో అన్ని రాజకీయ పక్షాలను కలుపునికి ఏకోన్ముఖంగా యాంటీ బీజేపీ పక్షాలు కనుక నడిస్తే విజయం సాధించడం కష్టం కాబోదు. ముఖ్యంగా వైసీపీ మద్దతు రాష్ట్రపతి ఎన్నికల్లో తులాభారంగా తులసీదళంగా మారుతోంది. 27 వేల ఓట్లను విలువ చేసే సభ్యుల బలం వైసీపీకి ఉంది. బీజేపీకి కావాల్సింది 20 వేల ఓట్ల మద్దతు. అంటే కచ్చితంగా బీజేపీ రాష్ట్రపతికి వైసీపీ మద్దతు ప్రాణవాయువు అవుతుంది అన్న మాట.

ఇంతటి కీలకంగా ఏపీ ఎపుడూ మారలేదు. దాంతో అటు దేశ రాజకీయాలు అన్నీ కూడా ఏపీ వైపు చూస్తున్నాయి. మరో వైపు విపక్షాలు కూడా తెలివిగా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా శరద్ పవార్ ని బరిలోకి దించుతున్నాయి. శరద్ పవార్ అంటే సౌతిండియాలో ఉన్న బీజేపీయేతర విపక్షాల‌ మద్దతు కచ్చితంగా కూడగట్టగలరు అని భావిస్తున్నాయి.

ఇక వైసీపీ మద్దతు ప్రత్యేకంగా రాబట్టడానికే శరద్ పవార్ ని బరిలోకి దించారన్న చర్చ కూడా ఉందిపుడు. శరద్ పవార్ ఒకనాడు వైఎస్సార్ కి కాంగ్రెస్ లో మంచి మిత్రుడు. ఆయన కోసం వైఎస్సార్ కూడా అప్పట్లో పాటుపడ్డారు. 1997 ప్రాంతంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష్య ఎన్నికల్లో శరద్ పవార్ కి నాడు ఉమ్మడి ఏపీలో బలమైన నాయకుడిగా ఉన్న వైఎస్సార్ మద్దతు పలికి తన వర్గం ఓట్లు వేయించారు.

అయితే నాడు కాంగ్రెస్ నేత సీతారాం కేసరి కి పోటీగా శరద్ పవార్ బరిలో నిలబడ్డారు. అయితే గెలవలేదు కానీ ఆయన పోటీ అన్నది ఒక సంచలనం అయింది. నాడు ఆయనకు ఏపీలో వైఎస్సార్ మద్దతు ఇచ్చారు. ఒక విధంగా వైఎస్సార్ కి మంచి మిత్రుడుగా శరద్ పవార్ ఉన్నారు.

ఈ నేపధ్యంలోనే జగన్ వైసీపీ పెట్టిన తరువాత శరద్ పవార్ ని పలుమార్లు కలసి రాజకీయాలు చర్చించేవారు. అలాంటి శరద్ పవార్ ఇపుడు దేశానికి రాష్ట్రపతి పదవికి పోటీకి వస్తే వైఎస్సార్ కుమారుడుగా జగన్ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది చర్చ. జగన్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన పవార్ తన స్నేహితుడి కుమారుడి మద్దతు పొందగలరా అన్నదే ఇక్కడ చర్చ.

మరో వైపు చూస్తే కేసీయార్ లాంటి వారు సైతం శరద్ పవార్ అభ్యర్ధి అంటే కచ్చితంగా ఆయన వైపు చూస్తారు. ఏది ఏమైనా శరద్ పవార్ క్యాండిడేట్ అయితే మాత్రం జగన్ కాస్తా ఊగిసలాట ఆడుతారు అని అంటున్నారు. ఆయన కనుక తండ్రి వైఎస్సార్ బాటలో నిర్ణయం తీసుకుంటే పవార్ కచ్చితంగా కొత్త రాష్ట్రపతి కావడం ఖాయం. నాడు తన చేతిలో తక్కువ ఓట్లు ఉన్నా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కావాలని వైఎస్సార్ విఫల ప్రయత్నం చేశారు.

ఇదంతా స్నేహితుని కోసం ఆయన చేసినది. కానీ ఇపుడు చూస్తే జగన్ మద్దతు కచ్చితంగా శరద్ పవార్ ని దేశానికే ప్రెసిడెంట్ ని చేస్తుంది. అంటే నాడు వైఎస్సార్ చేతిలో లేనిది నేడు జగన్ చేతిలో ఉంది. మరి తండ్రి మిత్రుడు, రాజకీయ కురు వృద్ధుడు అయిన పవార్ ని కొత్త రాష్ట్రపతిని చేసేందుకు జగన్ ముందుకు వస్తారా అంటే.చూడాలి మరి.