Begin typing your search above and press return to search.

అజిత్ పవార్ పై ఒత్తిడి.. బీజేపీకి షాకిస్తాడా?

By:  Tupaki Desk   |   24 Nov 2019 9:54 AM GMT
అజిత్ పవార్ పై ఒత్తిడి.. బీజేపీకి షాకిస్తాడా?
X
డిప్యూటీ సీఎం పోస్టుకు కక్కుర్తి పడి బీజేపీకి మద్దతిచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ చుట్టూ ఇప్పుడు అష్టదిగ్భంధనం చేస్తోంది ఎన్సీపీ పార్టీ. ఓవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అల్టీమేటం.. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి.. ఎన్సీపీ దిగ్గజ నేతలందరూ కలుస్తూ అజిత్ పవార్ ను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు అజిత్ కనుక మారితే బీజేపీకి మహారాష్ట్రలో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

అజిత్ పవార్ ను ఎన్సీపీ టార్గెట్ చేసింది. ఆయన వెంట ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కన్విన్స్ చేసి ఎన్సీపీకి మద్దతిస్తామని ప్రకటన చేశారు. శరద్ పవారే మా నేత అని ప్రకటించారు. దీంతో ఇప్పుడు అజిత్ పవార్ ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన్ను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ లోని కీలక నేతలు రంగంలోకి దిగారు.

ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక సందేశం పంపారు. తిరిగి సొంతగూటికి రావాలని తన అన్నకొడుకు అజిత్ పవార్ కు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోదరుడు శ్రీనివాస్ పవార్ ద్వారా రాయబారం పంపారు. ఇక మరో కుటుంబ సభ్యుడైన రోహిత్ పవార్ కూడా రంగంలోకి దిగి అజిత్ పవార్ మనసు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరిగి ఎన్సీపీలోకి రావాలని అజిత్ ను కోరుతున్నారు.

ఇక ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఏకంగా అజిత్ ఇంటికెళ్లి బుజ్జగించారు. తిరిగి రావాలని కోరారు. బలనిరూపణలోపు మనసు మార్చుకొని తమ వెంట రావాలని కోరినట్లు తెలిపారు.

అయితే అజిత్ పవార్ ఇలా పార్టీకి ఫిరాయించడం ఇదే కొత్తేమీ కాదు.. ఇదివరకూ కూడా తిరుగుబాటు చేసి తిరిగి వచ్చాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్టు కోసం మరోసారి తిరుగుబాటు చేశారు. అజిత్ పవార్ తో ఉన్న ఎమ్మెల్యేలు, కీలక అనుచరుడు ధనుంజయ ముండేను కూడా లాగేసిన ఎన్సీపీ పెద్దలు ఇప్పుడు అజిత్ పై ఒత్తిడి తెస్తున్నారు. అజిత్ మారితే మహారాష్ట్రలో బీజేపీ సర్కారు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.