Begin typing your search above and press return to search.

పుల్వామా దాడిలాంటిది ఇంకోటి జరగాలంటున్న మహారాష్ట్ర నేత

By:  Tupaki Desk   |   21 Sep 2019 12:05 PM GMT
పుల్వామా దాడిలాంటిది ఇంకోటి జరగాలంటున్న మహారాష్ట్ర నేత
X
మహారాష్ట్ర ఎన్నికల్లో మళ్లీ మేమే గెలుస్తామని బీజేపీ జబ్బలు చరుచుకుంటున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అపశకునం పలికారు. మహారాష్ట్రలో బీజేపీ గెలవాలంటే పుల్వామా అటాక్ వంటిది మరొకటి జరగాలన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ - బీజేపీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో బీజేపీ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారని - కానీ.. పుల్వామా ఉగ్రదాడి జరిగి జవాన్లు మరణించడం.. ఆ తరువాత పరిణామాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి బీజేపీ గెలిచిందని అన్నారు.

ఇప్పుడు అదే తరహాలో మరో పూల్వామా దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కబోదని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమి నుంచి అధికారాన్ని తాము చేజిక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫడ్నవీస్‌ సర్కారు గత ఐదేళ్లలో ప్రజలకోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోపాటు బహుజన్‌ వికాస్‌ అగాథి - సమాజ్‌ వాదీ పార్టీ వంటి చిన్న పార్టీలతో జత కలిసి కాషాయ కూటమిని ఎదుర్కోబోతున్నామని అన్నారు.

శరద్ పవార్ తామే గెలుస్తామని కలలు కంటున్నా మహారాష్ట్రలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో విజయం తరువాత మధ్యలో బీజేపీ కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఇటీవల కాలంలో సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ బాగా బలపడింది. అందుకే.. బీజేపీ జాతీయ నాయకులు అక్కడ పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

మరోవైపు 2014 ఎన్నికల తరువాత కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన శివసేన ఆ తరువాత కాస్త దూరమైనా మళ్లీ ఇప్పుడు బీజేపీతో కలిసి నడుస్తోంది. బీజేపీ - శివసేనలు కలిస్తే మహారాష్ట్రలో మిగతా పార్టీలకు కష్టమేనని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అంతేకాదు.. ఎన్సీపీ రోజురోజుకీ బలహీనపడుతోంది.. ఆ పార్టీ నేత - చత్రపతి శివాజీ వంశస్తుడు ఇటీవల బీజేపీలో చేరిపోయారు. మరోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏమాత్రం బలపడలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో తామే విజయం సాధిస్తామని శరద్ పవార్ చెప్పడం అత్యాశే అవుతుంది. పైగా పుల్వామా దాడి వంటిది జరిగితే తప్ప మోదీ గెలవలేరన్న ఆయన మాటలపైనా విమర్శలొస్తున్నాయి. ఎన్నికల కోసం జవాన్ల ప్రాణాలు పోవాలా.. లేదంటే జవాన్ల బలిదానంతో బీజేపీ గెలిచిందా.. జవాన్లకు - రాజకీయాలకు ఏం సంబంధంమంటూ పవార్‌ పై విమర్శలు కురుస్తున్నాయి.