Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలపై ఉత్తరాది నేతల కన్ను

By:  Tupaki Desk   |   26 Dec 2015 10:08 AM GMT
తెలుగు రాష్ట్రాలపై ఉత్తరాది నేతల కన్ను
X
ఉత్తరాదికి చెందిన ప్రముఖ నాయకులు కొందరు తెలుగు రాష్ట్రాలపై దృష్టిపెడుతున్నారా అన్న ప్రశ్పలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను బట్టి అది నిజమేనన్న భావన వ్యక్తమవుతోంది. ఉత్తరాదిలో జాతీయ పార్టీల హోదాలో ఉన్న సమాజ్ వాది పార్టీ - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటివి తెలుగు రాష్ట్రాలపై కన్నేస్తున్నట్లుగా ఉంది. ఈ పార్టీలో వాటికి పట్టున్న రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సమాజ్ వాది పార్టీ ఉత్తరప్రదేశ్ తో పాటు బీహార్ - మధ్యప్రదేశ్ - హర్యానా తదితర రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. ఎన్సీసీ కూడా మహారాష్ట్రతో పాటు గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ పోటీచేస్తుంది. గతంలో ఇతర పార్టీలతో జట్టుకట్టి ఒరిస్సాలోనూ కొన్ని సీట్లను గెలుచుకుంది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి అంత సీను కనిపించడం లేదు. అయితే... ఆ పార్టీల అధినేతలు రాజకీయాల్లో సీనియర్లుగా మారడంతో జాతీయస్థాయిలో కీలక పదవులు కోరుకుంటున్నారు. అందుకుగాను ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల నేతలు, పార్టీల మద్దతు కీలకమవుతుందని భావించి ఇక్కడ జరిగే కార్యక్రమాలకు, ఇక్కడి నేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల ములాయం సింగ్ - తాజాగా శరద్ పవార్ లు ఇక్కడికి రావడం అందులో భాగమేనంటున్నారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి వచ్చారు. ఆయన ఈ సందర్భంగా హైదరాబాదులో రేణుకాచౌదరి సహా పలువురు ఇతర నాయకులతో భేటీ అయ్యారు. పవార్ రాష్ట్రపతి పదవిని కోరుకుంటుండడం... ఇటీవల ఢిల్లీలో తన పుట్టిన రోజును పెద్ద ఎత్తున జరుపుకోవడం తెలిసిందే.

అలాగే ఇటీవల సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా హైదరాబాదు వచ్చారు. ఆ పార్టీ మాజీ ఎంపీ జయప్రద కుమారుడి పెళ్లికి ఆయన ఇక్కడకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన రాజకీయ భేటీల్లో పాల్గొనకపోయినప్పటికీ పార్టీతో సంబంధాల్లేని మాజీ ఎంపీ కుమారుడి పెళ్లి కోసం ఆయన హైదరాబాదు రావడం విచిత్రమే. పైగా ఆ సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ హైదరాబాద్ లో ఎవరితోనూ రాజకీయాలు మాట్లాడలేదని... అందుకోసం మరోసారి వచ్చే పనుందని ఆయన అనడం సంచలనంగా మారింది. ములాయం మూడో కూటమి వంటి కలలు కంటూ ప్రధాని పదవిపై కన్నేసిన సంగతి తెలిసిందే.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ దీన స్థితిలో ఉండడం.... బలంగా ఉందనుకున్న బీజేపీ కూడా పతనమవుతుండడంతో ఇలాంటి పెద్ద ప్రాంతీయ పార్టీల నాయకులు తమ రాజకీయ ఆకాంక్షలకు ఇది మంచితరుణమని భావిస్తున్నారు. తమకు పెద్దగా పట్టు, పరిచయాలు లేని దక్షిణాది రాష్ట్రాల్లో ఏ అవకాశం వచ్చినా వస్తూ ఇక్కడ కూడా పాపులరై అనుకున్నది సాధించుకునేందుకు ఈ ప్రాంత నేతలు, పార్టీల సహకారం పొందాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు ఉత్తరాది నాయకులు వస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.