Begin typing your search above and press return to search.

కేసీఆర్‌.. ఇలాంటి ఫ్రెండ్స్ ను మ‌ర్చిపోతారా?

By:  Tupaki Desk   |   24 March 2018 8:30 AM GMT
కేసీఆర్‌.. ఇలాంటి ఫ్రెండ్స్ ను మ‌ర్చిపోతారా?
X
అనుభ‌వంలోకి వ‌స్తే కానీ తత్త్వం బోధ ప‌డ‌ద‌ని ఊరికే అన‌రు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను అర్థం చేసుకునే వారు కంటే అపార్థం చేసుకునే వారే ఎక్కువ‌గా ఒక నానుడి రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ ను న‌మ్మి మోస‌పోయామ‌ని వాపోతుంటారు. కానీ.. ఆయ‌నెప్పుడు త‌న‌ను న‌మ్మ‌మ‌ని.. తాను మాట మీద‌నే నిల‌బ‌డ‌తాన‌ని అన‌వ‌స‌ర‌మైన ప్రామిస్ లు చేయ‌ర‌న్న విష‌యాన్ని మ‌రిచిపోతారెందుక‌ని ఆయ‌న సన్నిహితులు కూడా చెబుతుంటారు.

తాజాగా కేసీఆర్ తీరుపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడో పాత‌కాలం మిత్రుడు. తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లాడుతూ ఢిల్లీలో ప‌ట్టుకోసం కిందా మీదా ప‌డుతున్న వేళ‌లో.. కేసీఆర్ చాలామందితో స్నేహం చేశారు. త‌న వాద‌నను వినిపించ‌ట‌మే కాదు.. అయ్యో అనేలా చేసి.. వారి సానుభూతి పొందేలా చేశారు. ఇలా ఏళ్ల‌కు ఏళ్లు పోరాడిన త‌ర్వాత‌..కాలం క‌లిసి రావ‌టంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్య‌మైంద‌ని చెప్పాలి. ఇదంతా గ‌తం. పాత రోజులు పోయి చాలా కాల‌మే అయ్యింది.

ఢిల్లీలో త‌న‌కు ప‌ట్టు కోసం కేసీఆర్ చేసిన సంప్ర‌దింపుల ప‌ర్వం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. అప్ప‌ట్లో తాను క‌లిసేందుకు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించినా క‌ల‌వ‌ని ప్ర‌ముఖులకు ఇప్పుడు కేసీఆర్ వారి ఫోన్ల‌కు కూడా అందుబాటులోకి రావ‌టం లేద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. పవ‌ర్ చేతిలో ఉన్న వేళ‌.. దాన్ని ఎలా ప్ర‌ద‌ర్శించాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ప‌లువురు జాతీయ నాయ‌కుల‌కు కేసీఆర్ తీరు అస్స‌లు అర్థం కావ‌టం లేదట‌.

గ‌తంలో త‌మ‌తో స‌న్నిహితంగా ఉండ‌ట‌మే కాదు.. త‌మ మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నించిన పెద్ద‌మ‌నిషి ఇప్పుడు అత్తా ప‌త్తా లేద‌న్న ఆవేద‌న వారు వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా జ‌న‌తాద‌ళ్ (యూ) నేత‌..మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు శ‌ర‌ద్ యాద‌వ్ ఉన్నారు. గురువారం పార్ల‌మెంటులో త‌న‌కు ఎదురైన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో మాట్లాడుతూ.. కేసీఆర్ పై త‌న‌కున్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడే స‌మ‌యంలో నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ ప్రాణాల్ని కాపాడాల‌ని.. రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని తాను లోక్ స‌భ‌లో వాదించిన త‌ర్వాతే మొత్తం స‌భ రియాక్ట్ అయ్యింద‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వం ఆగ‌మేఘాల మీద రియాక్ట్ అయి.. ప్ర‌క‌ట‌న చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కేసీఆర్ కు అంత చేస్తే.. ముఖ్య‌మంత్రి అయ్యాక త‌న‌ను క‌ల‌వ‌లేద‌ని.. ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు మ‌మ‌తా వ‌ద్ద‌కు వెళ్ల‌టాన్ని ఆయ‌న ప్రస్తావించారు.

కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా ఏమైనా చేస్తే అది బీజేపీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. త్వ‌ర‌లోనే తాను హైద‌రాబాద్ రానున్న‌ట్లు శ‌ర‌ద్ యాద‌వ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అన్యాయంగా స‌భ నుంచి స‌స్పెండ్ చేసి.. త‌న స‌భ్య‌త్వాన్ని తీసిన వైనాన్ని శ‌ర‌ద్ యాద‌వ్‌ కు చెప్పుకొచ్చారు. జాతీయ రాజ‌కీయాల్లో కీ రోల్ పోసిస్తాన‌ని చెబుతున్న కేసీఆర్ కు.. శ‌ర‌ద్ యాద‌వ్ లాంటోళ్ల అసంతృప్తి అంత మంచిది కాద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. శ‌ర‌ద్ యాద‌వ్ ముచ్చ‌ట‌పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.