Begin typing your search above and press return to search.

ఒక శకం ముగిసింది.. శరద్‌ యాదవ్‌ ప్రస్థానమిదే!

By:  Tupaki Desk   |   13 Jan 2023 6:10 AM GMT
ఒక శకం ముగిసింది.. శరద్‌ యాదవ్‌ ప్రస్థానమిదే!
X
కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్‌ నేత, జనతాదళ్‌ యునైటెడ్‌ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ (75) ఇకలేరు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి స్వయంగా తెలిపారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయిన ఆయన చికిత్స పొందుతూ గురుగ్రామ్‌ లోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.

కాగా మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్‌ యాదవ్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి నాయకుడిగా రాణించారు. రామ్‌ మనోహర్‌ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆయన అడుగుజాడల్లో నడిచారు.


శరద్‌ యాదవ్‌ తొలిసారి మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పూర్‌ నుంచి జనతాదళ్‌ పార్టీ తరఫున 1971లో లోక్‌ సభ ఎంపీగా విజయం సాధించారు. 1977లో రెండోసారి కూడా జబల్‌ పూర్‌ ఎంపీగా గెలిచారు. 1986లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1989లో ఉత్తరప్రదేశ్‌ లోని బదౌన్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1989–90లో కేంద్ర జౌళి, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1995లో జనతాదళ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఎంపికయ్యారు. 1996లో ఐదోసారి లోక్‌ సభ ఎంపీగా గెలిచారు. 1997లో జనతాదళ్‌ జాతీయ అధ్యక్షుడిగా శరద్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు.

1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్‌ యాదవ్‌ ఆరోగ్య శాఖతోపాటు పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఒక్క 2004 ఎన్నికలు మినహాయించి 1991 నుంచి 2014 వరకు బిహార్‌ లోని మాధేపురా నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఓడిపోవడంతో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆయనను రాజ్యసభకు పంపారు. శరద్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఏడు సార్లు లోక్‌ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌ ఆవిర్భావంతో అప్పటి నుంచి 2016 వరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు.

2017లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి శరద్‌ యాదవ్‌ జేడీయూ నుంచి తప్పుకున్నారు. 2018లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌(ఎల్‌జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2022 మార్చిలో ఆ పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా శరద్‌ యాదవ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ,కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.