Begin typing your search above and press return to search.

మోడీ..జైట్లీ పుణ్యమా అని 4.6ల‌క్ష‌ల కోట్లు మాయం!

By:  Tupaki Desk   |   3 Feb 2018 4:55 AM GMT
మోడీ..జైట్లీ పుణ్యమా అని 4.6ల‌క్ష‌ల కోట్లు మాయం!
X
నిజంగానే నిజం. మోడీ లాంటి నిజాయితీ.. నికార్సైన నేత ప్ర‌ధానిగా ఉన్న వేళ రూ.4.6ల‌క్ష‌ల కోట్లు మాయం కావ‌టం ఏమిటి? అన్న సందేహం అక్క‌ర్లేదు. నిజాయితీ మాట ప‌క్క‌న పెట్టి.. ఎలాంటి కుంభ‌కోణాలు వెలుగులోకి రాకున్నా.. పాల‌కులు చేసే త‌ప్పుల‌కు ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని తాజా ప‌రిణామం చెప్ప‌క‌నే చెబుతుంద‌ని చెప్పాలి.

తాజాగా మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ప్ర‌క‌టించిన ఒక ప్ర‌క‌ట‌న స్టాక్ మార్కెట్‌ ను కుప్ప‌కూలేలా చేయ‌ట‌మే కాదు.. విలువైన మ‌దుప‌రుల సొమ్ము ఏకంగా 4.6ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు ఆవిరైన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వార్షిక బ‌డ్జెట్‌ లో దీర్ఘ‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ ప‌న్ను విధించ‌టం.. వ‌చ్చే ఏడాది ద్ర‌వ్య‌లోటు అంచ‌నాను 3.2 శాతంనుంచి 3.5 శాతానికి పెంచ‌టంతో మార్కెట్ లో ఆర్థిక రంగంపై విశ్వాసం దెబ్బ తింది.

అంతే.. స్టాక్ మార్కెట్లు కుప్ప కూల‌ట‌మే కాదు.. మార్కెట్లో ర‌క్త‌పుటేరులు పారాయి. ప‌లు షేర్లు భారీగా ప‌త‌నం కావ‌టం.. మొత్తంగా మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేస‌రికి సెన్సెక్స్ 840 పాయింట్ల భారీ న‌ష్టాన్ని చ‌విచూడ‌గా.. నిఫ్టీ మ‌రో 256 పాయింట్లు కోల్పోయింది.

న‌ష్ట‌తీవ్ర‌త ఎంత ఎక్కువ అంటే.. గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో కీల‌క సూచీలు ఈ స్థాయిలో న‌ష్ట‌పోవ‌టం ఇదే మొద‌టిసారి కావ‌టం గ‌మ‌నార్హం. ఆ విభాగం.. ఈ విభాగం అన్న తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్ల అమ్మ‌కాలు వెల్లువెత్తాయి. జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బ తీశాయి. గురువారం 750 పాయింట్ల శ్రేణిలో తీవ్ర ఆటుపోట్ల‌ను చ‌విచూసిన సెన్సెక్‌.. శుక్ర‌వారం సైతం అదే తీరు కొన‌సాగింది.

షేర్ల ధ‌ర‌లు అడ్డ‌గోలుగా ప‌త‌నం కావ‌టంతో ఒకే రోజుల్లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఏకంగా రూ.4.6ల‌క్ష‌ల కోట్ల మేర హ‌రించుకుపోయింది. 2015 ఆగ‌స్టు 24 త‌ర్వాత ఒకే సెష‌న్లో ఇంత భారీగా సెన్సెక్స్ న‌ష్ట‌పోవ‌టం ఇదే తొలిసారి. ఎనిమిది వారాలుగా దూసుకెళుతున్న సెన్సెక్స్ కు ఈ వారం బ్రేక్ ప‌డ‌ట‌మే కాదు.. భారీ ఆటుపోట్ల‌కు గుర‌య్యేలా చేసింది. మ‌దుపరుల‌కు షాకిస్తున్న ఈ ప‌రిణామంతో ఈ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడేగా మారింది.