Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడ్డాలో షర్మిల సాహసం.. అన్ని మాటలు అనేశారే!

By:  Tupaki Desk   |   1 Sep 2021 3:53 AM GMT
కేసీఆర్ అడ్డాలో షర్మిల సాహసం..  అన్ని మాటలు అనేశారే!
X
మంగళవారం వచ్చిందంటే చాలు.. కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసేందుకు ఒక వేదికను సిద్ధం చేసుకోవటం.. అందులో సారు సర్కారు మీద ఘాటు విమర్శలు చేయటం.. ఉలిక్కిపడేలా ఆరోపణలు చేయటం తెలిసిందే. గతానికి భిన్నంగా ఈసారి కేసీఆర్ అడ్డాలోనే ఆమె నిరసన చేపట్టటం గమనార్హం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొప్పు రాజు అనే వ్యక్తి.. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ రాక సూసైడ్ చేసుకోవటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు రాక వందలాది మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని.. అవన్నీ కేసీఆర్ హత్యలుగా ఆమె అభివర్ణించటం గమనార్హం.

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అనంతరావుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.ఒకరోజు నిరాహారదీక్షను చేపట్టారు. ఉదయం షురూ చేసిన నిరసనను.. సాయంత్రానికి ముగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఊహించని రీతిలో కేసీఆర్ సర్కారు పాలనను అఫ్గాన్ లోని తాలిబన్లతో పోల్చటం షాకింగ్ గా మార్చింది.

‘ఐదేళ్ల వైఎస్సార్ పాలనలో రైతులు రాజులు కావాలనుకున్నారు. తాలిబన్ల చేతుల్లో అఫ్గాన్లు చిక్కుకున్నట్లు.. ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల వారి చేతుల్లో చిక్కుకొని ఆగమవుతున్నారన్నారు. ఘాటైన విమర్శల్ని చేయటం షర్మిలకు అలవాటే. అదే సమయంలో రాజకీయ నేతలు ఎవరైనా సరే.. తమను ఒక్కమాట అంటే.. వారికి ఎదురుగా నాలుగు మాటలు అనే వరకు నిద్ర పోని గులాబీ బ్యాచ్ షర్మిల విషయంలో మాత్రం పూర్తి మినహాయింపు ఇవ్వటం.. ఆమె అనే మాటలకు చిన్నపాటి కౌంటర్ లేకుండా చూసుకోవటం తెలిసిందే.

తాజాగా కేసీఆర్ ను వ్యక్తిగతంగానూ.. ఆయన పాలనపైనా ఘాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల.. రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఏం చేయాలో చెప్పటమే కాదు.. అదిరే ఐడియా ఇచ్చారు. నిరుద్యోగులంతా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని.. వారికి వైఎస్సార్ టీపీ అండగా ఉంటుందన్నారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

1200 మంది విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వస్తే.. బంగారు తెలంగాణ అంటూ.. అప్పులు.. చావుల తెలంగాణగా మార్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితులపై 800 శాతం దాడులు పెరిగినట్లుగా చెప్పారు. దీనికి ప్రాతిపదిక ఏమిటన్నది షర్మిల మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ లో ఎన్నికలు వస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ కు దళితులు బంధువులు అయ్యారంటూ చురకలు వేసిన ఆమె.. దళితులకు దళితబంధు ఇవ్వటానికి.. ప్రభుత్వ భూములు అమ్మటాన్ని గుర్తు చేశారు.

ఇలా.. కేసీఆర్ అండ్ కోను ఉక్కిరిబిక్కిరి చేసేలా షర్మిల వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మరి.. ఇప్పటికైనా షర్మిల వ్యాఖ్యలకు గులాబీ దళం కౌంటర్ ఇస్తుందా? అలా వింటూ.. హైకమాండ్ ఆదేశాల కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా? అన్నది ప్రశ్నగా మారింది.