Begin typing your search above and press return to search.

మళ్లీ ప్రశ్న వేయకుండా తెలివిగా తప్పుకున్న షర్మిల..!

By:  Tupaki Desk   |   29 Jan 2022 7:30 AM GMT
మళ్లీ ప్రశ్న వేయకుండా తెలివిగా తప్పుకున్న షర్మిల..!
X
తెలంగాణ రాజకీయ సంచలనంగా వైఎస్ షర్మిల ఉన్నప్పటికీ.. ఆమెకు అవసరమైన మైలేజీ మాత్రం రాని పరిస్థితి. ఎంతలా ప్రయత్నిస్తున్నా ఆమె కోరుకున్న పరిణామాలు చోటు చేసుకోవటం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసి.. ఒక్క మాట కూడా అనిపించుకోకుండా ఉన్న అధినేత ఎవరైనా ఉన్నారంటే అది షర్మిల ఒక్కరేనని చెప్పాలి. అంతేనా.. కేటీఆర్ మాటల్ని.. ఆయనకే చెప్పి.. దిమ్మ తిరిగిపోయేలా పంచ్ ఇచ్చిన షర్మిల.. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావుల వాగ్థాటికి ఏ మాత్రం తీసిపోరని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. అనుకోని రీతిలో ఏపీ రాజకీయాల్లోకి షర్మిల అడుగుపెడతారన్న వార్తలు రావటం సంచలనంగా మారింది. అయితే.. ఇందులో నిజం ఎంత? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని ఆమె నుంచి రాబట్టాలని మీడియా ప్రయత్నిస్తుంటే.. చెప్పిచెప్పినట్లుగా వ్యాఖ్యలు చేసిన ఆమె..క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ పెంచారనే చెప్పాలి. అయితే.. తాజాగా ఆమెఈ విషయంలో ఒక స్పష్టతకు వచ్చినట్లుగా చెప్పాలి.

తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిలను ఏపీరాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారంటూ ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించటంతో.. ఆమె రోటీన్ కు భిన్నంగా స్పందించారు. కాస్తంత విసురుతో.. ఏపీ గురించి నాతో మాట్లాడకండి అంటూ జవాబు ఇచ్చి.. ఇతర ప్రశ్నలు అడుగుతున్న వారికి సమాధానం ఇచ్చేందుకు తాను ప్రాధాన్యత ఇస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

తెలంగాణ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. చెప్పాను కదండి.. ఇష్యూను డైవర్ట్ చేయటానికే ఇదంతా. ఈయన పరిపాలన చేయడు.. ఆయన పరిపాలన చేయడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో టీఆర్ఎస్.. బీజేపీ దొందూ దొందూనేనని మండి పడ్డారు. ఎవరైనా మంచి చేస్తే.. మరింత మంచి చేయటానికి అవతల వారు ప్రయత్నిస్తారంటూ టీఆర్ఎస్.. బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా షర్మిల నోటి నుంచి వ్యాఖ్య.. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలకు సరిపోయేలా ఉండటం గమనార్హం. అదేంటో తెలంగాణ అధికార పార్టీ గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలన్ని.. ఏపీ పార్టీకి తగిలినట్లుగా సరిగ్గా సరిపోతున్నాయన్నట్లుగా ఉండటం గమనార్హం. ఇందుకు తగ్గట్లే తాజా ప్రెస్ మీట్ లో షర్మిల నోటి నుంచి వచ్చిన.. ‘అసలు ఇష్యూను డైవర్ట్ చేయటానికే ఇదంతా’.. ‘‘ఈయన పరిపాలన చేయడు.. ఆయన పరిపాలన చేయడు’ లాంటి మాటలు ఇట్టే కనెక్టు అవుతున్నాయని చెప్పక తప్పదు. మాట్లాడే మాటల విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని షర్మిల ఎప్పటికి గుర్తిస్తారో?