Begin typing your search above and press return to search.

షర్మిల మొత్తం దాని మీదనే ఆధారపడుతున్నారా?

By:  Tupaki Desk   |   18 Aug 2021 12:30 AM GMT
షర్మిల మొత్తం దాని మీదనే ఆధారపడుతున్నారా?
X
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన షర్మిల రాజకీయ ఎంట్రీ అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తలపండిన రాజకీయ ప్రముఖులు సైతం ఆమె ఎంట్రీ విస్మయానికి గురి చేసింది. ఎడారి ఇసుకలో తైలాన్ని తీయాలన్న ఆమె ఆలోచన అయోమయానికి గురి చేయగా.. మరే అంచనాలతో ఆమె ఎంట్రీ ఇచ్చారో కానీ.. ఆమె పట్టుదలను చూసి కొందరు ముచ్చటపడితే.. ఆమె మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకున్నోళ్లు ఉన్నారు. ఎవరేం అనుకుంటే నాకేంటి.. నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారమే అన్న విషయాన్ని బాహాటంగా చెప్పటానికి ఆమె అస్సలు మొహమాటపడలేదు. అంతేనా.. ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురై.. ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం ఖాయం.. అప్పుడు చూపిస్తా నా తఢఖా అన్న మాట కూడా వచ్చేయటం హాట్ టాపిక్ గా మారింది.

లక్ష్యం క్లిష్టమైన వేళ.. అందుకు తగ్గట్లు పడాల్సిన కష్టం ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం షర్మిలకు తెలియంది కాదు. కానీ.. ఆమె మాత్రం మరే విషయాన్ని పట్టించుకోకుండా నిరుద్యోగ అంశాన్ని మాత్రమే తీసుకోవటం.. దాని చుట్టూనే ఆమె తన రాజకీయాన్ని తిప్పటం మాత్రం అర్థంకానిదిగా మారింది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మౌనంగా ఉంటున్న ఆమె.. నిరుద్యోగం.. ఉద్యోగాల భర్తీ మీదనే ఆమె ఆందోళనలు.. నిరసనలు చేస్తున్నారు. మొదట్లో షర్మిల సభలకు మీడియా ప్రాధాన్యత లభించేది. కానీ.. ఇటీవల కాలంలో వారు కూడా తగ్గించేశారన్న మాట వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. కొద్ది నెలల్లో జరిగే ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే ఆమె తన స్టాండ్ ను చెప్పేశారు. ఎవరైనా ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విద్యార్థి నాయకుడు బరిలోకి దిగితే తాను మద్దతు ఇస్తానని చెప్పిన ఆమె.. తమ పార్టీ తరఫున మాత్రం అభ్యర్థిని నిలబెట్టేదే లేదని స్పష్టం చేశారు. అదేమంటే.. ఈ ఎన్నికలు స్వార్థం కోసం జరుగుతున్నాయి. అసలీ ఉప ఎన్నికే పెద్ద రాజకీయం.. దీనిలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందా? అంటూసిత్రమైన వాదనను వినిపిస్తున్నారు.

తాజాగా ఆమె చేస్తున్న నిరాహార దీక్షకు అంత పెద్ద స్పందన లేదన్న మాట వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే.. లోటస్ పాండ్ వద్ద నిర్వహించిన నిరసనకు.. ఇందిరా పార్కు వద్ద చేసిన ఆందోళనకు వచ్చిన స్పందన అంతంత మాత్రమేనన్న మాట వినిపిస్తోంది. తాను టేకప్ చేసిన నిరుద్యోగ సమస్య మీద ఇప్పటికే నాలుగు జిల్లాల్లో నిరసన చేసిన ఆమెకు వచ్చిన స్పందన అంతంత మాత్రమే. ఇది ఆమెను తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుందని చెబుతున్నారు.

ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఘాటు విమర్శలు చేస్తున్నా.. మీడియాలో వస్తున్న కవరేజ్ అంతంత మాత్రంగా ఉండటం.. ఆమె మాటలకు ఇస్తున్న ప్రాధాన్యత పెద్దగా లేకపోవటంతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారు ఎవరైనా సరే.. కేసీఆర్ ను ఒక్క మాట అంటే చెలరేగిపోయే గులాబీ దళం.. షర్మిల మాటల్ని పిచ్చ లైట్ తీసుకోవటం కూడా అర్థం కావట్లేదని చెబుతున్నారు. షర్మిల ఎంత ఘాటు విమర్శ చేసినా.. టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదని.. అసలు ఆ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవటం లేదంటున్నారు.

ఎప్పటికప్పుడు వినూత్న పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చి కేసీఆర్ దూసుకెళుతుంటే.. ఆయన తీరును తీవ్రంగా తప్పు పడుతూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇందుకు భిన్నంగా షర్మిల మాత్రం నిరుద్యోగ అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ చేస్తున్న దీక్షలు.. పాత చింతకాయ పచ్చడిలా మారాయన్న విమర్శ వినిపిస్తోంది. దళిత బంధుగురించి అందరూ మాట్లాడుతుంటే.. షర్మిల మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా దీని గురించి స్పందించకపోవటాన్ని తప్పు పడుతున్నారు. ఎంత చేసినా.. గొర్రె తోక బెత్తెడు మాదిరి.. షర్మిల ఎంత ఆరాట పడుతున్నా ఆమెకు దక్కుతున్న మైలేజీ మాత్రం పెద్దగా ఉండకపోవటాన్ని ఆమె అనుచర వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే షర్మిల తన వ్యూహాన్ని.. ఎత్తుగడల్ని కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కలుగక మానదు.