Begin typing your search above and press return to search.

ష‌ర్మిల.. కేఏ పాల్.. ఇద్ద‌రూ సేమ్ టు సేమ్‌

By:  Tupaki Desk   |   7 Feb 2022 8:30 AM GMT
ష‌ర్మిల.. కేఏ పాల్.. ఇద్ద‌రూ సేమ్ టు సేమ్‌
X
రాజ‌కీయాల్లో నెగ్గుకురావ‌లంటే సీరియ‌స్‌నెస్ ఉండాలి. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌ణాళిక‌లు వేస్తూ ఎద‌గాలి. ఏదో వ‌చ్చాం పార్టీ పెట్టాం పోటీ చేస్తాం అంటే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే చెప్పాలి. అందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేఏ పాల్ ఓ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. రాజ‌కీయాల్లో ఆయ‌న ఓ క‌మెడియ‌న్‌గా మిగిలిపోయార‌నే అభిప్రాయాలున్నాయి.

గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ ప్ర‌జాశాంతి త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ఆయ‌న ఎన్ని స్టంట్లు వేసిన అవి వినోదంగా మారాయే త‌ప్ప ఓట్లు తెప్పించ‌లేక‌పోయాయి. ఇప్పుడు తెలంగాణ‌లో ష‌ర్మిల ప‌రిస్థితి కూడా అలాగే మారుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ కేఏ పాల్ కాలం గ‌డుపుతున్నారు. ప్ర‌పంచ శాంతి కోసం తాను అన్ని దేశాల అధ్య‌క్షుల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని గొప్ప‌గా చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ చివ‌ర‌కు ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కుని బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించారు. 2008లో ప్ర‌జాశాంతి పార్టీని స్థాపించారు.

దాని మీద 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ప్ర‌చారం సంద‌ర్భంగా ఆయ‌న చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కానీ చివ‌ర‌కు నామినేష‌న్ వేయ‌డానికి ఆల‌స్యంగా వెళ్లి హాస్యాస్ప‌ద‌మ‌య్యారు. న‌ర్సాపూర్ నుంచి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుగా ఓడారు.

ఆ స‌మ‌యంలో త‌న‌ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ పోయింద‌ని ఇదంతా ప్ర‌భుత్వం చేసింద‌ని ఆరోపించారు. ఆ కంప్యూట‌ర్‌ లోనే త‌న పార్టీ అభ్య‌ర్థుల వివ‌రాలున్నాయ‌ని చేతులెత్తేశారు. త‌న కంప్యూట‌ర్ ప‌గిలిపోయింద‌ని చివ‌ర‌కు కామెడీ పాల్‌ గానే మిగిలిపోయారు. ఇప్పుడు కేఏ పాల్ లాగే తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల యాక్టింగ్‌గా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రాష్ట్రంలో రాజ‌న్న రాజ్య‌మే ల‌క్ష్యంగా గ‌తేడాది దివంగ‌త ముఖ్య‌మంత్రి త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. కానీ ఆ పార్టీకి ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు. కీల‌క నేత‌లంతా పార్టీ వీడారు. నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటం, పాద‌యాత్ర‌, రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరు.. ఇలా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆమెకు మైలేజీ మాత్రం రావ‌డం లేదు.

ఏదో మీడియా హ‌డావుడి త‌ప్ప ఆమె పార్టీని తెలంగాణ రాజ‌కీయాల్లో ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ పై ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు చేసినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోతుంది. ఇంకా త‌న పార్టీకి ఎన్నిక‌ల గుర్తు కూడా రాలేదు. ఆమెకు క‌నీసం ప‌ట్టుమ‌ని ప‌దిమంది కార్య‌క‌ర్త‌ల బ‌లం కూడా లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌తో త్రిముఖ పోటీ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆమె వెలుగులోకి రావ‌డం క‌ష్ట‌మేన‌న్న టాక్ ఉంది. దీంతో ఆమె చివ‌ర‌కు కేసీఆర్‌, మోడీ క‌లిసి త‌న పార్టీకి గుర్తు రాకుండా చేశార‌ని విమ‌ర్శించి ఏపీ వెళ్లిపోతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఆమె పార్టీ ప్ర‌స్థానం కూడా కేఏ పాల్ లాగా కామెడీగా మిగిలిపోతుంద‌ని చెబుతున్నారు.