Begin typing your search above and press return to search.

జగన్ వదిలిన బాణం వచ్చేదెప్పుడు..?

By:  Tupaki Desk   |   12 Oct 2015 4:00 AM GMT
జగన్ వదిలిన బాణం వచ్చేదెప్పుడు..?
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లటం కోసం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీక్ష మొదలు పెట్టిన రోజు నుంచి నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులెవరూ జగన్ దీక్షా శిబిరానికి రాలేదు.

నాలుగోరోజు మాత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు .. జగన్ తల్లి విజయమ్మ దీక్షా శిబిరానికి వచ్చి కంటతడి పెట్టుకున్నారు. చెట్టంత కొడుకు నీరసించిపోయి.. చిక్కినట్లుగా కనిపించటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. తల్లికి ఉండే బాధను ఆమె బయటపెట్టుకొన్నారు. ఇదంతా చూసిన చాలామంది భావోద్వేగంతో కదిలిపోయారు.

విజయమ్మ శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శిస్తే.. ఆదివారం దీక్షా శిబిరాన్ని జగన్ సతీమణి భారతి సందర్శించారు. జగన్ పక్కనే కూర్చున్న ఆమె.. చూస్తుండిపోయారు. నీరసించిన జగన్ ను పరామర్శించేందుకు భారతి రావటంతో.. కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరుగా రానున్నారన్న మాట వినిపిస్తోంది.

జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకునే ఆయన సోదరి షర్మిల ఇప్పటివరకూ దీక్షా శిబిరాన్ని సందర్శించలేదు. సోమవారం ఆమె దీక్షా శిబిరానికి వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. దీక్ష మొదలు పెట్టి ఆరు రోజులు కావటం.. జగన్ నీరసించిపోవటం.. బరువు తగ్గటం.. షుగర్ లెవల్స్ పడిపోవటం.. బీపీ తగ్గుతున్న నేపథ్యంలో.. ఏపీ సర్కారు బలవంతంగా అయినా జగన్ దీక్షను విరమించే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీక్ష ద్వారా మరింత మైలేజ్ పొందాలని భావిస్తున్న జగన్ అండ్ కో.. సోమవారం షర్మిల రానున్నారని చెబుతున్నారు. పరామర్శలు కూడా వ్యూహాత్మకంగా మారటం సమకాలీన రాజకీయాలకు పరాకాష్ఠగా చెప్పుకోవాలేమో.