Begin typing your search above and press return to search.

ఓదార్పేనా.. ఎన్నికల ప్రచారం చేయరా షర్మిల

By:  Tupaki Desk   |   1 Jan 2016 6:17 AM GMT
ఓదార్పేనా.. ఎన్నికల ప్రచారం చేయరా షర్మిల
X
‘‘నేను జగనన్న బాణాన్ని’’ అంటూ హుషారెక్కించే మాటలతో ఆకట్టుకునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల మరోసారి బయటకు వస్తున్నారు. నిజానికి ఆమె వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. తన సోదరుడు జైల్లో ఉన్నప్పుడు నాటి విపక్ష నేత చంద్రబాబుకు పోటీగా పాదయాత్ర చేసి.. విపరీతంగా కష్టపడి.. డైలీ బేసిస్ లో అందరిని తిట్టేసిన ఆమె వైఖరి చూసిన చాలామంది.. పూర్తిస్థాయి రాజకీయాల్లో షర్మిల వచ్చేసినట్లుగా భావించారు. అయితే.. అలాంటి వాటికి ఇష్టపడని జగన్ అన్న వైఖరితో తన పాత్రను పరిమితంగా చేసుకున్న షర్మిల ఆన్ అండ్ ఆఫ్ గా వచ్చిపోవటం కనిపిస్తుంది.

అందరూ షర్మిలను మర్చిపోయే సమయంలో ఆమె తెర మీద తళుక్కుమంటారు. మిగిలిన ఏ రాజకీయ నేతలకు లేని ఒక అద్భుతమైన అవకాశం.. అయుధం జగన్ ఫ్యామిలీకి ఉంటుంది. తన తండ్రి.. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక పలువురు మరణించారు. ఇలా మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు షురూ చేసిన ఓదార్పు యాత్ర ఏడేళ్లు దాటుతున్నా పూర్తి కాకుండా సా...గుతోంది. రాజకీయ శూన్యత ఆవహించినప్పుడు.. ప్రజల్లో ఒక్కసారి తళుక్కుమనేందుకు.. తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు ఒక అయుధంగా వాడుకుంటున్న ఓదార్పు యాత్రలోని మరో ఎపిసోడ్ పూర్తి చేయటానికి షర్మిల తాజాగా బయటకు రానున్నట్లు చెబుతున్నారు.

చిత్రమైన విషయం ఏమిటంటే.. రాజకీయ పార్టీలకు కీలకమైన ఎన్నికల సమయంలో పత్తా లేకుండా ఉండే షర్మిలమ్మ.. ఎన్నికలకు కాస్త ముందే ఓదార్పు యాత్ర చేసి వెళ్లటం కనిపిస్తుంది. వరంగల్ ఉప ఎన్నికలకు కాస్త ముందు ఓదార్పు యాత్రను చేసిన ఆమె.. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది లేదు. రేపోమాపో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగరా మోగుతుందన్న మాట వినిపిస్తోన్న తరుణంలో ఆమె మళ్లీ తన ఓదార్పు యాత్రకు తెర తీయటం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు తాను పర్యవేక్షిస్తానంటూ చెప్పిన షర్మిలమ్మ.. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా.. ఓదార్పు యాత్ర చేయటం ఏమిటన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించని దుస్థితి. ఇప్పటివరకూ వివిధ జిల్లాల్లో చేపట్టిన ఓదార్పు యాత్రను..ఈసారి హైదరాబాద్ మహా నగరంలో షర్మిల చేపట్టనున్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్ర సరే.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం మాటేమిటన్న ప్రశ్నకు జగనన్న బాణం బదులిస్తే బాగుంటుందేమో.