Begin typing your search above and press return to search.

పులివెందుల పర్యటనలో షర్మిలను కలిసిన ఏకైక నేత ఆయనేనా?

By:  Tupaki Desk   |   16 March 2021 2:30 PM GMT
పులివెందుల పర్యటనలో షర్మిలను కలిసిన ఏకైక నేత ఆయనేనా?
X
దివంగత మహానేత వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే.. కడప జిల్లాలో పర్యటిస్తున్నారంటే చాలు.. ఆయన్ను అభిమానించే నేతలు పెద్ద ఎత్తున వారి వెంట ఉంటారు. జగన్ అయితే.. అన్నా అని.. షర్మిలను అయితే అమ్మా అని పిలుస్తూ.. జిల్లా దాటే వరకు వారి వెంటే ఉంటారు. వారి కుటుంబానికి వైసీపీ నేతలు అంత ప్రాధాన్యతను ఇస్తారు. ఇదిలా ఉంటే.. తాజాగా పులివెందులకు వచ్చారు షర్మిల. అన్న మాటకు భిన్నంగా తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆమెను ఈసారి కలిసేందుకు వైసీపీ నేతలు ఎవరూ రాకపోవటం గమనార్హం.

మామూలుగా అయితే.. షర్మిల పులివెందులకు వస్తే.. వైసీపీ నేతలు పోటెత్తుతారు. ఆమెను కలుస్తారు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సోమవారం మాజీ మంత్రి.. వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెండో వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల వస్తే.. ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. తన పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు షర్మిల ఇష్టపడలేదు. గతంలో పులివెందులకు వచ్చినప్పుడు ఆమెకు సన్నిహితంగా ఉండే వైసీపీ నేతలు సైతం ఈసారి ముఖం చాటేయటం గమనార్హం.

మొత్తంగా చూసినప్పుడు రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఒక్కరు మాత్రమే షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. మిగిలిన వారంతా ముఖం చాటేయటం.. ఆసక్తికర చర్చకు తెర తీసింది. అన్న జగన్ మాటకు భిన్నంగా తన దారిలో తాను నడుస్తున్న షర్మిల విషయంలో వైసీపీ నేతలు ఇంత దూరాన్ని ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది.