Begin typing your search above and press return to search.

షర్మిలలో రాజకీయ దూరదృష్టి ఇంత తక్కువా?

By:  Tupaki Desk   |   4 Sep 2021 1:30 PM GMT
షర్మిలలో రాజకీయ దూరదృష్టి ఇంత తక్కువా?
X
మారథాన్ లో పాల్గొనే అథ్లెట్ ఎవరైనా సరే.. తమకు శక్తి మొత్తాన్ని పరుగు పందెం మొదలైన కొద్ది క్షణాల్లోనే ఖర్చు చేయరు. అనవసర అలసటకు అవకాశం ఇవ్వకుండా.. మారథాన్ లో ఎప్పుడు ఎంత ఎనర్జీని ఖర్చు చేయాలో అంత చేస్తే.. ఆచితూచి పరుగు తీస్తారు. అప్పుడు మాత్రమే ఆటను గెలిచే వీలుంది. అంతదాకా ఎందుకు సినిమా ఆరంభంలోనే క్లైమాక్స్ సీన్ చూపించేస్తే ఏమవుతుంది? తాజాగా షర్మిల వ్యవహారం కూడా అలానే ఉంది. తెలంగాణలో పొలిటికల్ పార్టీ ప్రారంభించాలన్న నిర్ణయంతో అందరిని విస్మయానికి గురి చేసిన ఆమె.. అందరిలో సమాధానాల కంటే ఎక్కువగా ప్రశ్నలే తలెత్తేలా చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పార్టీ ప్రారంభానికి తనకున్న పరిమితులు ఏమిటి? ఎదురయ్యే సవాళ్లు ఏమిటన్న విషయాన్ని ఆమెతో పాటు.. ఆమె వెంట నడిచే వారికి.. తెలంగాణ ప్రజానీకానికి బాగానే అర్థమైందని చెప్పాలి.

రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన వెనుకున్న బలమైన కారణాన్ని షర్మిల కన్వీన్స్ అయ్యేలా చెప్పకపోవటంతో ఆమె మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. తన తండ్రి వైఎస్ ఇమేజ్ కారణంగా.. ఆమె పిలిచినంతనే కార్లు వేసుకొని లోటస్ పాండ్ కు తరలి వచ్చిన వారంతా ద్వితీయశ్రేణి నాయకులే తప్పించి.. ప్రజల్లో పట్టు ఉన్న వారెవరూ లేరన్నది మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోరాజకీయ పార్టీ ఏర్పాటు అంత సామాన్యమైన విషయం కాదు.

అన్ని హంగులు ఉన్నా.. ప్రజల్లో ఆమోదనీయత అన్నది చాలా ముఖ్యమన్నది మర్చిపోకూడదు. షర్మిల మిస్ అయిన పెద్ద పాయింట్ ఏమైనా ఉందంటే అదే. తెలంగాణ ఏర్పాటు వెనుక దశాబ్దాల తరబడిన పోరాటం.. అమాయకుల ప్రాణాలు మాత్రమే.. సీమాంధ్ర వ్యతిరేక భావోద్వేగం బలంగా ఉంది. అదెంత అంటే.. కేసీఆర్ మీద వ్యతిరేకత.. ఆయన నిర్ణయాల్ని వ్యతిరేకించే వారు సైతం.. ఆయన్ను ఓపెన్ గా వ్యతిరేకించటానికి ఏడేళ్ల తర్వాత కూడా పెద్దగా ఇష్టపడని వర్గం తెలంగాణలో ఉందన్నది మర్చిపోకూడదు.

కేసీఆర్ తీరును తప్పు పట్టటం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొందరపాటుతో కూడుకున్నదన్న మాట ఎక్కడ వస్తుందో అన్న భావనే.. చాలామంది మేధావులు నోరు మెదపకుండా ఉన్నారన్నది వాస్తవం. తెలంగాణ ఏర్పాటు కారణంగా కేసీఆర్ ను తెచ్చుకున్నామన్న వాదనను వినిపిస్తే.. తాము ఎక్కడ తక్కువ అవుతామన్న జంకు చాలామంది మేధావుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంత బలంగా తెలంగాణవాదాన్ని ప్రేమిస్తున్న ప్రజలు.. సాంకేతికంగా చెప్పుకోవటానికి మాత్రమే పనికి వచ్చే ‘తెలంగాణ కోడలు’ మాటతో షర్మిలను ఎందుకు ఓకే చేస్తారన్నది పెద్ద ప్రశ్న.

ఇదిలా ఉంటే.. పార్టీ పెట్టకముందే.. ఏదో ఒక రోజు తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపడతానన్న మాట షర్మిల నోటి నుంచి రావటం ఆమె చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పక తప్పదు. తెలంగాణ ప్రజల కష్టాల్ని.. వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కంటే కూడా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీదనే ఆమె ఫోకస్ ఉందన్న విషయం అర్థమయ్యేలా ఆమె మాటలు చాలామందిని అలెర్టు అయ్యేలా చేయటమే కాదు.. షర్మిల తీరును వేలెత్తి చూపేలా చేశాయి.

తాజాగా తన తండ్రి వైఎస్ పన్నెండో వర్థంతి నేపథ్యంలో తన తల్లి విజయమ్మ చేత ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఐడియా వరకు బాగానే ఉంది. ఈ సభకు రావాలంటూ పలువురిని ఆహ్వానించటం వరకు వంక పెట్టలేనిది. కానీ.. ఈ సభకు షర్మిల సోదరుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రానప్పటికీ.. ఆయన సానుకూలంగా ఉండి ఉంటే షర్మిలకు ప్లస్ గా ఉండేది. అందుకు భిన్నంగా.. ఆయనకు సదరు సభ సుతారం ఇష్టం లేదని.. తన మంత్రివర్గంలోని వారిని సైతం ఆత్మీయ భేటీకి హాజరు కావొద్దన్న సంకేతాలు ఇచ్చిన వైనం ఒక దెబ్బ అయితే.. సభలో షర్మిల మాట్లాడిన మాటలు చాలామంది నిర్ఘాంతపోయేలా చేశాయని చెప్పాలి.

పేరుకు వైఎస్ ఆత్మీయ సమావేశం మాత్రమే కానీ.. సభలో షర్మిల మాట్లాడిన మాటలన్ని తెలంగాణ చుట్టూ.. తన అధికార అభిలాషను తెలియజేశాయన్నది మర్చిపోకూడదు. ఆత్మీయ సభను అంతవరకు మాత్రమే నిర్వహించి ఉంటే బాగుండేది. ఎందుకంటే.. వైఎస్ రాజకీయ వారసురాలు షర్మిల కూడా అన్నంతవరకు బాగానే ఉండేది. అందుకు భిన్నంగా.. సభలో తెలంగాణ విషయంలో తానేం కోరుకుంటానన్న విషయాన్ని షర్మిల దాచిపెట్టుకోకుండా చెప్పేసిన వైనం చాలామందికి నచ్చలేదు.

రాజకీయ నేత ఎవరైనా.. తన తర్వాత వేసే వ్యూహాత్మక అడుగులు తెలియకుండా ఉండాలని భావిస్తారు. అందుకు భిన్నంగా షర్మిల మాత్రం.. అదేమీ లేకుండా ఓపెన్ అయిపోవటం ఆభాసుపాలు అయ్యేలా చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. పేరుకు వైఎస్ ఆత్మీయ సమావేశమని చెప్పారే కానీ..చేతల విషయానికి వస్తే తన సొంత పార్టీ ఇమేజ్ కోసమే సభను నిర్వహించారన్న విషయం అందరికి అర్థమైపోయింది. ఈ సభ ద్వారా షర్మిల చేయకూడని తప్పుల్ని చేసినట్లు చెబుతారు. తనలోని రాజకీయ పరిపక్వత ఎంత తక్కువన్న విషయాన్ని షర్మిల ఆత్మీయ సమావేశం ద్వారా తెలియజేశారన్న విమర్శ వినిపిస్తోంది. ఆమె సలహాదారులు ఎందుకిలాంటి సలహాలు ఇస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి షర్మిల ఆత్మీయ సమావేశంలో చెప్పిన మాటల్ని ఇప్పుడు కాకుండా మరెప్పుడు చెప్పినా బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.