Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ విలీనం వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

By:  Tupaki Desk   |   1 Nov 2021 10:31 AM GMT
ఏపీ, తెలంగాణ  విలీనం వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
X
కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకుల వ్యాఖ్యల్లో..‘రెండు రాష్ట్రాల విలీనం’మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణ పథకాలను చూసి ఆంధ్రా ప్రజలు తమ రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించాలని అంటున్నారని సీఎం కేసీఆర్ ఇటీవల పార్టీ ప్లీనరీ సందర్భంగా అన్నారు. దీనికి కౌంటర్ గా ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ఏపీలో పార్టీని పెట్టడం ఎందుకు? రెండు రాష్ట్రాలను విలీనం చేస్తే పోలా? అని పేర్కొన్నారు. అయితే, తెలంగాణపై మళ్లీ కుట్రలు చేసి ఏపీతో కలిపే యత్నాలు సాగుతున్నాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మరింత ముందుకెళ్లి మరోసారి సమైక్య రాష్ట్రం ప్రతిపాదన తెచ్చారు.

కేసీఆర్ సమైక్య రాష్ట్రానికి సై అంటే.. ఆయనకు తాను మద్దతిస్తానని ప్రకటించారు. ఈ వాదనలన్నీ ఇలా సాగుతుండగా.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉన్న దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల భిన్నంగా స్పందించారు. పూర్తి తెలంగాణ వాది తరహాలో.. ఒక్కసారి విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యమని, రాజకీయ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఏం తమాషాలు చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ప్రజలు అన్మదమ్ముల్లా కలిసి బతుకుదామంటూ ఆదివారం నల్లగొండ జిల్లా పాదయాత్ర సభలో అన్నారు.

ఓవైపు అచ్చమైన తెలంగాణ నాయకలే ఏపీతో సంబంధాలపై భిన్న వ్యాఖ్యలు చేస్తుండగా.. ఉమ్మడి ఏపీ సీఎంగా, సమైక్యవాదానికి బ్రాండ్ గా ముద్రపడిన వైఎస్ఆర్ కుమార్తె షర్మిల మాత్రం తెలంగాణ పక్షాన మాట్లాడడం గమనార్హం. దీనిపై మిగతా పార్టీల్లోనూ ఇక మీదట చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో షర్మిల వైఖరి కచ్చితంగా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. సాక్షాత్తు అన్న వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉండగా, షర్మిల తెలంగాణ, ఏపీ విలీనంపై చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరమే. అంతేకాక, వైఎస్సార్ కు భారీ అనుచర గణం ఉన్న, తెలంగాణవాదం ప్రబలంగా ఉన్న, ఏపీతోనూ సరిహద్దు బంధాలు గట్టిగా ఉండే నల్లగొండ జిల్లాలోకి తన పాదయాత్ర ప్రవేశం సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవే. అన్నిటికి మించి తెలంగాణతో తనది విడదీయరాని బంధం అని, ఈ రాష్ట్రంలో వైఎస్సార్ కు భారీగా అభిమానులున్నారని చెప్పే షర్మిల.. కీలక రాజకీయ పరిణామంపై కచ్చితమైన అభిప్రాయం ప్రకటించడం మిగతా రాజకీయ పార్టీలను ఒకింత ఆలోచనలో పడేసినట్లే. ఇక ఇదే సమయంలో అటుఇటు ఆలోచన లేకుండా తాను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉంటానన్న సందేశాన్ని ఆమె ఇక్కడి ప్రజలకు పంపించారు.

కాగా, నల్లగొండ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు, చిన్నారులకు కేసీఆర్ పాలనలో రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు లేవని జాతీయ హరిత ట్రైబ్యునల్ పనులను నిలిపివేయమనడం కేసీఆర్ చేతగానితనమని.. ఏడేళ్లుగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు తేకుండా కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా? అంటూ ధ్వజమెత్తారు.