Begin typing your search above and press return to search.

షర్మిల.. అనిల్ మొదట మీట్ ఎక్కడ? ప్రపోజ్ చేసిందెవరు? వైఎస్ రియాక్షన్?

By:  Tupaki Desk   |   27 Sep 2021 4:55 AM GMT
షర్మిల.. అనిల్ మొదట మీట్ ఎక్కడ? ప్రపోజ్ చేసిందెవరు? వైఎస్ రియాక్షన్?
X
ప్రముఖల కుటుంబాల్లో జరిగే విషయాలు గాలి వాటంగా విషయాలు బయటకు వస్తుంటాయే తప్పించి.. అందులో నిజం ఎంత? అన్నది పెద్ద ప్రశ్న. అలాంటిది.. ఆ కుటుంబానికి చెందిన వారే స్వయంగా మీడియాముందకు వచ్చి మాట్లాడటం.. తమ జీవితంలో జరిగిన విశేషాల గురించి తెలియజేయటం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరిదాకానో ఎందుకు.. దివంగత మహానేత వైఎస్ కుటుంబానికే వస్తే.. ఆయన గారాల పట్టి షర్మిల గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆమె ప్రసంగాలు సుపరిచితం. ఎవరూ అంచనా వేయని రీతిలో సొంత పార్టీని తెలంగాణలో పెట్టిన ఆమె సంచలనంగా మారారు.

అలాంటి షర్మిలది లవ్ మ్యారేజ్. కానీ.. దాని గురించి ఆమె ఎప్పుడు చెప్పింది లేదు. ఆమెను అడిగింది లేదు. ఆ లోటును తీర్చటమే కాదు.. తన ప్రేమ.. పెళ్లి గురించిన వివరాలతో పాటు.. అనిల్ ను తాను ఎప్పుడు.. ఎక్కడ కలిశానన్న విషయాన్ని ఆమె తెలియజేశారు.

కామన్ ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ శివారులోని ఒక ధాబాకు వెళ్లినప్పుడు అనిల్ కలిశారన్నారు. అప్పుడు తాను చదువుకుంటున్నాని.. అప్పటి నుంచి అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్లమన్నారు. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే కాదన్న ఆమె.. తనను అనిలే ముందు ప్రపోజ్ చేశారన్నారు. కానీ.. వైఎస్ ఒప్పుకోలేదన్నారు. ‘వాళ్లు బ్రాహ్మిణ్స్‌. మన పద్ధతులు వేరు. వాళ్ల పద్ధతులు వేరు. నువ్వు ఉండలేవు. నీకు ఇప్పుడు బానే ఉంటుంది. తరువాత తరువాత తెలుస్తుంది’ అని చెప్పారన్నారు. తర్వాత చాలా గొడవలువస్తాయని.. వద్దంటూ నాన్న నచ్చజెప్పారని.. కానీ తాను వినలేదన్నారు. చివరకు అలా జరిగిపోయిందన్న ఆమె.. ప్రేమ పెళ్లి విషయంలో ఎప్పుడూ తాను బాధపడింది లేదన్నారు.

ఆహార అలవాట్లు కూడా భిన్నమని.. తనకు చికెన్ లేనిదే డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లాలనిపించదని.. అయితే అనిల్ తో తనకు ఆ సమస్య లేదని చెప్పింది. ఎందుకంటే.. ధాభాల్లో అనిల్ చికెన్ తినేవాడని.. కానీ వాళ్లింట్లో మాత్రం నాన్ వెజ్ తినరన్నారు. మరి.. అనిల్ మీ క్యాంపెయిన్ కు వస్తారా? అని ప్రశ్నిస్తే.. ఆయన (ఇవాంజలిస్ట్) మతప్రచారకుడని.. ఆయన ఎప్పుడూ క్యాంపెయిన్ చేయలేదన్నారు.

తమకు ఇద్దరు పిల్లలు అని.. కొడుకు రాజాకు 21 ఏళ్లు అని.. అమ్మాయికి 19 ఏళ్లు అని.. ఇద్దరూ అమెరికాలో ఉన్నారన్నారు. రాజాకి మార్షల్ ఆర్ట్స్ చాలా ఇష్టమని.. ఎకనామిక్స్ స్టూడెంట్ అన్నారు. కుమార్తె బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ చదువుతోందని.. తను అమ్మ కూచి అని చెప్పింది. తనను విడిచి పెట్టి అమెరికాకు వెళ్లటం ఇష్టం లేదని పేర్కొన్నారు షర్మిల.