Begin typing your search above and press return to search.

కేటీఆర్ వర్సెస్ షర్మిల: నాడు తెలియదని.. నేడు పొగిడేసింది

By:  Tupaki Desk   |   25 Dec 2021 6:30 AM GMT
కేటీఆర్ వర్సెస్ షర్మిల: నాడు తెలియదని.. నేడు పొగిడేసింది
X
తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల చర్యలు అనూహ్యంగా ఉన్నాయి. ఆమె అడుగులు ఎప్పుడు ఎలా పడుతాయో అర్థం కాని పరిస్థితి. కొన్ని నెలల క్రితం ‘కేటీఆర్ ఎవరు? నాకు తెలియదు’ అని తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తాజాగా కేటీఆర్ కు మద్దతుగా నిలిచారు. షర్మిల చర్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి..

మంత్రి కేటీఆర్ కు మద్దతుగా వైసీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిలిచారు. బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరిచేలా ట్వీట్ చేశాడు. దీనిపై షర్మిల స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు అండగా నిలిచారు.

‘పిల్లలకు ఒక తల్లిగా.. రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా.. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా.. పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి’ అని షర్మిల తాజాగా కేటీఆర్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.

అభివృద్ధి విషయమై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న తాజాగా వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా?’ అనే అర్థం వచ్చేలాగా ట్విట్టర్ లో తీన్మార్ మల్లన్న పోస్టు పెట్టాడు.

ఈ పోస్టుపై ఆగ్రహించిన టీఆర్ెస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ మేరకు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ కూడా సీరియస్ అయ్యి అధిష్టానం పెద్దలను ట్యాగ్ చేస్తూ నిరసన తెలిపారు. ఇక ఈ విషయంలో వైఎస్ షర్మిల కూడా మద్దతు తెలుపడం విశేషంగా మారింది.