Begin typing your search above and press return to search.

షర్మిల పాలపిట్ట రాజకీయం ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   4 July 2021 3:33 AM GMT
షర్మిల పాలపిట్ట రాజకీయం ఏం చెబుతోంది?
X
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని చూసినప్పుడు ఒక వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఏపీ ప్రజల్లో లేని ఒక గుణం తెలంగాణ ప్రజల్లో ఎక్కువగా ఉన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆంధ్రోళ్లతో పోలిస్తే.. తెలంగాణ వారిలో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సరిగా టచ్ చేయాలే కానీ ఇట్టే భావోద్వేగానికి గురవుతారు. తెలంగాణ వారితో పోల్చినప్పుడు ఆంధ్రా ప్రాంతం వారిలో ఈ గుణం పెద్దగా కనిపించదు. చాలా విషయాల్లో వారి స్పందన గుంభనంగా ఉంటుందే తప్పించి.. వెంటనే బయటపడిపోదు.

తెలంగాణ రాజకీయాల్లోకి రావటానికి ముందు.. తెలంగాణ ప్రజల మనసులపై వైఎస్ షర్మిల బాగానే పరిశోధన చేసినట్లుగా చెబుతారు. తనకున్న పరిమితులపై ఆమెకున్న అవగాహన ఎక్కువని.. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానన్న వెంటనే తనపై జరిగే మాటల దాడికి ఆమె ముందే ప్రిపేర్ కావటమే కాదు.. తన రాజకీయ కార్యాచరణకు సంబంధించి పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లుగా చెప్పాలి. తాజాగా ఆమె పార్టీ జెండాకు సంబంధించిన ప్రకటన ఇదే విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. రానున్న రోజుల్లో తన రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

త్వరలో తన పార్టీని షురూ చేయనున్నట్లు ప్రకటించిన షర్మిల.. ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. తాజాగా తమ పార్టీ జెండాను ఖరారు చేసిన ఆమె.. అదెలా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను తన పార్టీ జెండాకు వాడేయటం ద్వారా.. షర్మిల తన పార్టీపై ఆసక్తిని ప్రజల్లో పెంచే ప్రయత్నం చేశారు. పాలపిట్ట రంగును పార్టీ జెండాలో 80 శాతం మేరకు వాడతామని.. మిగిలిన 20శాతం నీలి రంగుతో ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల ఎనిమిదిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని పార్టీని అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్న ఆమె.. పార్టీ జెండాపై కీలక సమాచారాన్ని బయటపెట్టారు.

జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం.. అందులో వైఎస్ ఫోటో ఉంచటం ద్వారా తన ఎజెండాను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇప్పటికే ఆమె తన మాటల్లో తరచూ వైఎస్ ప్రస్తావన తీసుకొస్తుంటారు. రాజన్న రాజ్యం.. రాజన్న కల.. రాజన్న అలా అనుకునేవారు.. రాజన్న ఇలా అనుకునేవారు.. రాజన్న అయితే ఇలా చేసే వారా? ఇలా వైఎస్ జపం చేసే ఆమె.. తన పార్టీ జెండాలోనూ కీలక భూమిక ఉండేలా చేశారని చెప్పాలి. ఈ రోజు (ఆదివారం) పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఇందులో పార్టీ జెండా దర్శనమిచ్చే అవకాశం ఉందంటున్నారు.

తాజాగా పార్టీ జెండా ఎలా ఉంటుందని చెప్పిన షర్మిల పార్టీ నేత మాట ప్రకారం..తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆమె టచ్ చేస్తారని.. వాటిల్లో సింహభాగాన్ని తన పార్టీకి వాడేయటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెంటిమెంట్ ను రగల్చటం ద్వారా తన రాజకీయాల్ని నడిపించాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లుగా చెప్పాలి. తెలంగాణ ప్రజలు ఇట్టే కనెక్టు అయ్యు తెలంగాణ సెంటిమెంట్ అంశాలు.. తనకున్న ఏకైన బలం.. వైఎస్ ను కలిపి వాడేయనున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే పార్టీ ఆవిర్భావ దినోత్సం వేళ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాల్ని పూలతో అలంకరించాలన్న టాస్కును తన పార్టీ నేతలకు.. కార్యకర్తలకు ఇచ్చారు. దీనికి సంబంధించిన స్పందన ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడున్న అసలు ప్రశ్న. ప్రస్తుతానికి పాలపిట్టను వాడేసినప్పటికీ.. రానున్న రోజుల్లో అవసరానికి అనుగుణంగా తెలంగాణకు సంబంధించిన మరిన్నింటిని తన పార్టీలో కొట్టొచ్చేలా చేయాలన్నది ఆమె లక్ష్యమని చెబుతున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ఆమె వాడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. అదెలా ఉంటుందన్న దానిపై మాత్రం స్పష్టత రావట్లేదు. మరి..షర్మిల సెంటిమెంట్ రాజకీయానికి తెలంగాణ ప్రజల స్పందన ఏ రీతిలో ఉంటుందన్నది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.