Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా శ‌శి థ‌రూర్ ని చంపింది!

By:  Tupaki Desk   |   5 Dec 2017 8:29 AM GMT
సోష‌ల్ మీడియా శ‌శి థ‌రూర్ ని చంపింది!
X

బాలీవుడ్ ఓ దిగ్గ‌జ న‌టుడిని కోల్పోయింది.`మేరే పాస్ మా హై` అన్న ఒకే ఒక్క డైలాగ్ తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపిన అల‌నాటి అందాల న‌టుడు త‌ర‌లి రాని లోకాల‌కు వెళ్లిపోయాడు. త‌న రొమాంటిక్ చిత్రాల‌తో అశేష అభిమానుల‌ను సంపాదించుకున్న లెజెండ‌రీ యాక్ట‌ర్ శ‌శి క‌పూర్ క‌న్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం మ‌ర‌ణించారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ కు మూడో కుమారుడు- ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కపూర్ - షమ్మీ కపూర్ కు సోదరుడు అయిన శ‌శిక‌పూర్ 1938 మార్చి 18న జన్మించారు. రాజ్ కపూర్ నటించిన ఆగ్ - ఆవారా చిత్రాల్లో శ‌శి క‌పూర్ (బల్బీర్ రాజ్ కపూర్)బాలనటుడిగా న‌టించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి రొమాంటిక్ హీరోగా పాపుల‌ర్ అయ్యారు. 1961లో ధర్మపుత్ర చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించారు. వందకు పైగా చిత్రాల్లో శశికపూర్ నటించారు.

అయితే, కపూర్ల వంశం నుంచి వ‌చ్చిన శ‌శి క‌పూర్ ఓవ‌ర్ నైట్ లో స్టార్ డ‌మ్ సంపాదించుకోలేదు. అంద‌రి లాగే సినిమా అవ‌కాశాల కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. హీరోగా నిలదొక్కుకునేందుకు శ‌శికపూర్ అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చారు. ఫ్లాప్ హీరో ముద్ర నుంచి స్టార్ హీరో స్థాయికి ఎద‌గ‌డానికి చాలా శ్ర‌మ ప‌డ్డారు. 80వ దశకంలో రాజేశ్‌ ఖన్నా - శశికపూర్ ల మ‌ధ్య పోటీ ఉండేది. రాజేశ్‌ ఖన్నా రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాల‌లో శశికపూర్ న‌టించారు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కు సోదరుడి పాత్రలో శశికపూర్‌ ఎక్కువ చిత్రాల్లో కనిపించారు. బిగ్ బీ అమితాబ్ తో న‌టించిన దీవార్ చిత్రంలో ‘మేరే పాస్ మా హై` అనే డైలాగ్ దేశవ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. ఆ చిత్రానికి శ‌శి క‌పూర్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డును అందుకొన్నారు. నిర్మాతగా జునూన్ - కలియుగ్ - 36 చౌరంగీ లేన్ - విజేత - ఉత్సవ్ - అజూబా చిత్రాలను నిర్మించారు. అజూబా చిత్రానికి శశి కపూర్ దర్శకత్వం వహించారు. రష్యా భాషలో వోజ్ వర్షిచెనియే బాగ్గాద్కోదో వోరా అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. ది హౌస్ హోల్డర్ - షేక్ స్పియర్ వాలా - ప్రెట్టి పాలీ - బాంబే టాకీ - సిద్ధార్థ - హార్ట్ అండ్ డస్ట్ - సమ్మీ అండ్ రోసి గెట్ లెయిడ్ - ది డిసీవర్స్ - జిన్నా - సైడ్ స్ట్రీట్స్ అనే ఇంగ్లిషు సినిమాల్లో కూడా న‌టించారు. హాలీవుడ్ నటి జెన్నిఫర్ కెండాల్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. శ‌శి క‌పూర్ సంతానం...కునాల్ కపూర్ - సంజనా కపూర్ - కరణ్ కపూర్ ల‌కు బాలీవుడ్ తో అనుబంధం ఉంది. శ‌శి క‌పూర్ కుటుంబానికి ప‌లువురు బాలీవుడ్ - రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ సభ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.

మ‌రోవైపు, శశి కపూర్ మ‌ర‌ణ వార్త విని ఓ ఆంగ్ల మీడియా.....కపూర్‌ కి బదులు థరూర్‌ అని రాసింది. దీంతో శ‌శి థ‌రూర్ ఆఫీసుకు చాలామంది ఫోన్లు చేసి ఆయ‌న యోగక్షేమాలు క‌నుక్కుంటున్నారు. దీంతో, ఈ ఘ‌ట‌న‌పై శ‌శి థ‌రూర్ వివ‌ర‌ణ ఇచ్చారు. చ‌నిపోయింది శ‌శి క‌పూర్ అని థరూర్‌ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పేరు త‌న పేరు ఒకేలా ఉండడంతో కన్‌ ఫ్యూజ్‌ అవుతుంటార‌ని, త‌న‌కు ఫోన్లు వ‌స్తున్నందుకు బాధ లేద‌ని అన్నారు. గొప్ప‌న‌టుడు - అంద‌గాడు అయిన శశి కపూర్ ని తాను కూడా మిస్సవుతున్నాన‌ని థరూర్‌ పేర్కొన్నారు.