Begin typing your search above and press return to search.

పాకిస్ధాన్ ను కాంగ్రెస్ సమర్ధిస్తోందా ?

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:30 PM GMT
పాకిస్ధాన్ ను కాంగ్రెస్ సమర్ధిస్తోందా ?
X
ఏ విషయంలో చూసినా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు భారత్ పై కాలుదువ్వుతున్న పొరుగునే ఉన్న దాయాది దేశం పాకిస్ధాన్ ను కాంగ్రెస్ సమర్ధిస్తోందా ? తాజాగా హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ భారత్ కన్నా పాకిస్ధాన్ కరోనా వైరస్ నియంత్రణలో మెరుగైన చర్యలు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు. పాకిస్ధాన్ ను అభినందిస్తు కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

భారత్-పాకిస్థాన్ దేశాల పరిస్ధితులు తెలిసిన వాళ్ళెవరూ దాయాది దేశాన్ని అభినందించరంటూ కమలనాధులు మండిపడుతున్నారు. పాకిస్ధాన్ ను పొగడాలంటే మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లు మొదలుపెట్టారు. నిజానికి థరూర్ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధానమంత్రిపై కాంగ్రెస్ కు ఏమైనా కోపముంటే నేరుగా తేల్చుకోవాలే కానీ మధ్యలో పాకిస్ధాన్ ను పొగడటం ఏమిటంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నేత వైఖరి చూస్తుంటే కరోనా వైరస్ నేపధ్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడిని టార్గెట్ చేస్తున్నట్లుగానే ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రధాని నిర్లక్ష్యం కారణంగానే మనదేశం ఆర్ధికంగా ఎంతో నష్టపోయినట్లు సీనియర్ నేత ఆరోపించారు. దీన్ని కూడా బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణపై మోడిని విమర్శించే ముందు తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో వైరస్ ఏ విధంగా కంట్రోల్ అయ్యిందో అందుకు కారణం ఎవరో తెలుసుకుని మాట్లాడలంటూ గట్టిగానే తగులుకున్నారు.

కరోనా మహమ్మారి గురించి రాహూల్ గాంధీ ముందే హెచ్చరించినా కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోలేదని థరూర్ కామెంట్ ను కూడా కమలనాదులు కొట్టేస్తున్నారు. మొన్నటి ఫిబ్రవరిలోనే రాహూల్ కేంద్రాన్ని వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరించారని చెప్పటాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లోనే రాహూల్ చేసిన హెచ్చరికలపై కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టుంటే ఇఫుడు మనకు ఈ దుస్ధితి వచ్చేది కాదని థరూర్ చేసిన ఆరోపణలు ఇఫుడు రాజకీయంగా వేడిపుట్టిస్తున్నాయి.

థరూర్ చెప్పిందంతా బాగానే ఉంది కానీ కొద్దిరోజులుగా దేశంలో కరోనా ఉదృతి తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వైరస్ తీవ్రంగా ఉన్నపుడు మాట్లాడని థరూర్ తీవ్రత తగ్గుతున్న సమయంలో ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా మనకన్నా పాకిస్ధాన్ మెరుగైన చర్యలు తీసుకున్నట్లు కితాబిస్తున్నారు. బహుశా రాహూల్ చేసిన హెచ్చరికలను పాకిస్ధాన్ ప్రభుత్వం ఏమైనా వినిందంటారా ?