Begin typing your search above and press return to search.

పోలింగ్ ముందు థరూర్ ఏడుపేమిటి ?

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:55 AM GMT
పోలింగ్ ముందు థరూర్ ఏడుపేమిటి ?
X
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ బాధ చాలా విచిత్రంగా ఉంది. పోలింగుకు మరో మూడు రోజులుందనగా మీడియా ముందు గోలగోల చేస్తున్నారు. ఇంతకీ ఆయన బాధేమిటంటే థరూర్ ను ఎవరు పట్టించుకోవటం లేదట.

తనకు ఏ రాష్ట్రమూ సహకరించలేదట. తనతో పాటు పోటీచేస్తున్న మల్లికార్జున ఖర్గేకి సహకరించిన వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, నేతలు తన విషయంలో ముఖం చాటేశారని తెగ బాధపడిపోతున్నారు.

మూడు రోజుల్లో పోలింగ్ పెట్టుకుని ఇపుడు ఏడవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని థరూర్ కి తెలీదా ? ఖర్గేకి మద్దతిస్తున్న పీసీసీలు తనకెందుకు ఇవ్వటంలేదో థరూర్ కి తెలీదా ? ఖర్గే పోటీలోకి దిగటంతోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులున్నట్లు అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం గ్రహించిన తర్వాత పీసీసీలు సీనియర్ నేతలు ఖర్గేకి మద్దతుగా నిలవకుండా తనకు నిలుస్తారని లేదా ప్రచారంలో సహకరిస్తారని థరూర్ ఎలాగ అనుకున్నారు ?

సోనియాకు లేఖలు రాసి జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజి మసకబారేట్లు చేసిన జీ23 గ్రూపులోని నేతల్లో థరూర్ కూడా ఒకరన్న విషయం తెలిసిందే. తమ ఆలోచనలను, అభ్యంతరాలను సోనియాను నేరుగా కలిసి చెప్పుకునే అవకాశం ఉన్నాకూడా ఉద్దేశ్యపూర్వకంగానే లేఖలు రాశారు. రాసిన లేఖలను తర్వాత మీడియాకు విడుదలచేశారు. దీనివల్ల అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్ధితి మరింతగా దిగజారిపోయింది.

పార్టీ జనాల్లో పలుచనవటానికి కారణమైన నేతల్లో థరూర్ కూడా కీలకపాత్రే పోషించారు. అసలు థరూర్ పోటీలోకి దిగినపుడు సొంతరాష్ట్రం కేరళ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే సొంతరాష్టం నేతలు మద్దతుగా నిలవలేదన్న విషయం అర్ధమవుతోంది.

ఈ పరిస్ధితుల్లో ఇతర రాష్ట్రాల నేతలు ఎందుకు మద్దతిస్తారు ? ఏదేమైనా తాజా ఆరోపణలు, వేధన చూసిన తర్వాత థరూర్ తన ఓటమిని ముందుగానే అంగీకరించేసినట్లు తెలిసిపోతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.