Begin typing your search above and press return to search.

శ‌శిథ‌రూర్ 'చిల్ల‌ర' వ్యాఖ్య‌లు విన్నారా!

By:  Tupaki Desk   |   20 Nov 2017 8:16 AM GMT
శ‌శిథ‌రూర్ చిల్ల‌ర వ్యాఖ్య‌లు విన్నారా!
X
ఓ స్థాయిలో ఉన్న వ్య‌క్తులు అందుకు త‌గిన‌ట్లుగానే హుందాగా ప్ర‌వ‌ర్తించాలి. అంతేకానీ అత్త‌మీద కోపం దుత్త మీద చూపిస్తే అడ్డంగా బుక్కైపోతారు. స‌రిగ్గా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి శ‌శిథ‌రూర్ విష‌యంలో అదే జ‌రిగింది. స‌మ‌యం - సంద‌ర్భం లేకుండా చేసే వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి ప్ర‌తిస్పంద‌న వ‌స్తుందో అయ్య‌గారికి ఇప్పుడు బాగా అర్థ‌మ‌వుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేయాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు బెడిసికొట్టేశాయి. ఫ‌లితంగా థ‌రూర్‌ ను నెటిజ‌న్లు ఏకిపారేస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి - తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. సంద‌ర్భోచితంగా ట్వీట్లు చేస్తుంటారు. అయితే మ‌న దేశానికి చెందిన మానుషీ చిల్లార్.. మిస్ వ‌ర‌ల్డ్‌ గా ఎంపిక‌వ‌డంపై ఆయ‌న చేసిన ట్వీట్ వివాదాస్ప‌ద‌మైంది. 17ఏళ్ల త‌ర్వాత మ‌న దేశానికి విశ్వ‌సుంద‌రి కిరీటం వ‌స్తే ఆయ‌న స్పందించిన తీరు నెటిజ‌న్ల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

"మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో... బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. మన చిల్లరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండ‌టం వ‌ల్లే చిల్లర్ విశ్వ‌ సుందరిగా ఎన్నికై రుజువు చేసింది" అంటూ శ‌శిథ‌రూర్‌ ట్వీట్ చేశారు. ఈ వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయాల‌కు ముడిపెడుతూ ఆయ‌న ట్వీట్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మొదలైంది. దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత‌ భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకు వస్తే మానుషీ చిల్లర్‌ ను చిల్లరతో పోల్చడం శశిథరూర్ చిల్లర వ్యాఖ్యలకు నిదర్శనమని నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు.. శశిథరూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషీని తక్కువ చేసేలా ట్వీట్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమన్ల జారీకి సిద్ధమైంది. ప్ర‌ముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ కూడా థరూర్ పై మండిప‌డ్డారు. ఇక మానుషీ జాట్ వ‌ర్గానికి చెందిన యువ‌తి కావ‌డంతో శ‌శిథ‌రూర్‌కు జాట్ వ‌ర్గం నుంచి కూడా సెగ మొదలైంది. ఆమెను అవమానించడం అంటే జాట్‌లను అవమానించడమేనని ఆ వర్గానికి చెందిన వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థ‌రూర్ ప్ర‌భుత్వానికి వేయ‌బోయిన కౌంట‌ర్ విక‌టించి ఆయ‌న‌కే గ‌ట్టి షాకిచ్చిన‌ట్లైంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.