Begin typing your search above and press return to search.

టీ-కాంగ్రెస్‌లో మ‌రో కుంప‌టి.. మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   17 Aug 2022 2:32 PM GMT
టీ-కాంగ్రెస్‌లో మ‌రో కుంప‌టి.. మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ కాంగ్రెస్‌కు ఏమైంది? ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రుగా పార్టీపై విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. పార్టీని బ‌ల‌హీన ప‌రిచేలా వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న‌గాక మొన్న‌.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వ్య‌వ‌హారం ఒక కుదుపు కుదిపేసింది.

ఇక‌, అదేస‌మ‌యంలో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్న దాసోజు శ్రావ‌ణ్ కుమార్‌.. చివ‌ర‌కు ఆ టికెట్ ద‌క్క‌ద‌ని భావించి.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రేపిన వార్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా అనేక గ‌ళాలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక‌, ఇప్పుడు మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్‌లో కాక పుట్టించారు. తెలంగాణ గాంధీభవన్‌కు సమాంతరంగా మరో ఆఫీస్‌ నడుస్తోందని ఆయ‌న  సంచలన వ్యాఖ్యలు చేశారు.  

టీపీసీసీ వ్యవహారశైలితో విసిగిపోయా అని అన్నారు. డబ్బులతో పీసీసీ ప‌ద‌విని కొన్నారన్న కోమటిరెడ్డి వాదనను నమ్ముతున్నట్లు తెలిపారు. తాము హోమ్‌గార్డుల్లాగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్‌, రాజగోపాల్‌రెడ్డి చెప్పినవి నిజాలని స్పష్టం చేశారు. `ముగ్గురు` కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని మ‌ర్రి వ్యాఖ్యానించారు.  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అలా మాట్లాడడం సరికాదని మర్రి శిశిధర్‌రెడ్డి  అన్నారు. మొత్తంగా ఒక‌దాని వెంట ఒక‌టిగా జ‌రుగుతున్న ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ఏమైంది? అనే చ‌ర్చ చేస్తున్నారు.

ఇక‌, ఈ పార్టీని బాగు చేసేవారు లేరా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వైపు.. మునుగోడు ఉప ఎన్నిక.. మ‌రికొద్ది నెల‌ల్లోనే.. ముంద‌స్తు లేదా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్న త‌రుణంలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన నాయ‌కులు.. ఇప్పుడు ఇలా ఒక‌రిపై ఒక‌రు వ్యాఖ్య‌లు చేసుకోవ‌డం ద్వారా.. సాధించేది ఏంట‌ని నిల‌దీస్తున్నారు.