Begin typing your search above and press return to search.

మానవత్వం నడిచొచ్చి సీటిచ్చింది...

By:  Tupaki Desk   |   10 Aug 2015 9:24 AM GMT
మానవత్వం నడిచొచ్చి సీటిచ్చింది...
X
స‌మ‌స్య‌లో చిక్కుకున్న‌ప్పుడు స్పందించే హృదయం ఎదురుకావ‌టం ఒక అదృష్టం. సాధార‌ణంగా సినిమాల్లో చూసే చాలా సీన్లు.. సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతాయి. రియ‌ల్ లైఫ్ లో అస్స‌లు క‌నిపించ‌వు. కానీ.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం విన్న‌వారంతా విస్మ‌యం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. అజ్ఞాతంగా ఉండిపోయిన ఆ వ్య‌క్తి గురించి విప‌రీత‌మైన ఆస‌క్తి వ్య‌క్త‌మవుతోంది.

ఏదైనా క‌ష్టంలో ఉంటే.. స్పందించి.. నిమిషాల వ్య‌వధిలో స‌మ‌స్య‌కు ప‌రిష్క‌రం చూపించే సినిమా హీరోలా ఓ వ్య‌క్తి చూపించిన మాన‌వత్వం ఒక పేదింటి యువ‌తికి కాలేజీలో సీటు దొరికేలా చేసింది. సినిమాల్లో క‌నిపించే ట్విస్ట్‌ ల‌కు ఏ మాత్రం తీసుకొని ఈ ఘ‌ట‌న‌లోకి వెళితే..

త‌మిళ‌నాడులోని ఒక గ్రామానికి చెందిన యువ‌తి స్వాతి. ఆర్థికంగా వెన‌కున్నా.. చ‌దువులో మాత్రం ముందుండే స్వాతి.. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర స్థాయి హెచ్ ఎస్ ఈ ప‌రీక్ష‌లో మొత్తం 1200 మార్కుల‌కు 1017 మార్కులు సాధించింది. కౌన్సిలింగ్‌ కు హాజ‌రు కావాల‌న్న త‌మిళ‌నాడు అగ్రిక‌ల్చ‌ర‌ల్ వ‌ర్సిటీ లెట‌ర్ ను తీసుకున్న స్వాతి చెన్నై బ‌య‌లుదేరింది.

అవ‌గాహ‌న లేక‌పోవ‌ట‌మే.. తెలిసిన వారి మాట‌ను గుడ్డిగా న‌మ్మ‌ట‌మో కానీ.. అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ ఎక్క‌డ ఉంటుంద‌ని గ్రామంలో అడిగితే చెన్నై లో ఉంటుంద‌ని చెప్ప‌టంతో త‌ల్లి తంగ‌పొన్నుతో క‌లిసి స్వాతి ఉద‌యాన్నే చెన్నై చేరుకొంది. చిరునామా క‌నుక్కొని అన్నా యూనివ‌ర్సిటీకి చేరుకున్న వారికి.. కౌన్సిలింగ్ జ‌రిగేది చెన్నై లో కాద‌ని.. కోయంబ‌త్తూరులో అని చెప్ప‌టంతో షాక్ త‌గిలినంత ప‌నైంది. ఎందుకంటే.. చెన్నై నుంచి కోయంబ‌త్తూరు చాలా దూరం.

ఎంత‌గా ప్ర‌య‌త్నించినా.. కౌన్సిలింగ్ స‌మ‌యానికి చేరుకోవ‌టం క‌ష్టం. దీంతో.. వ‌ర్సిటీ పార్కులో ఏడుస్తూ త‌ల్లీ కూతుళ్లు కూర్చున్నారు. అప్పుడే ఓ విచ‌త్రం జ‌రిగింది. వీరు బాధ‌ప‌డ‌టాన్ని చూసిన ఒక మార్నింగ్ వాక‌ర్‌.. ఏమైంద‌ని అడ‌గ‌టం.. వీరు మొత్తం విష‌యాన్ని చెప్ప‌టం జ‌రిగింది.

అంతే.. వెంట‌నే స్పందించిన అత‌ను.. వెంట‌నే త‌న కారులో ఎయిర్‌ పోర్ట్‌ కి తీసుకెళ్లి కోయంబ‌త్తూరు ఫ్లైట్ లో ఎక్కించ‌ట‌మే కాదు.. వారు అక్క‌డ ఎయిర్‌ పోర్ట్ లో దిగిన వెంట‌నే వారిని రిసీవ్ చేసుకోవ‌టానికి ఒక వ్య‌క్తిని వాహ‌నాన్ని సిద్ధం చేశాడు. అంతేకాదు.. యూనివ‌ర్సిటీ వీసీ కి ఫోన్ చేసి స్వాతి వివ‌రాలన్నీ చెప్పి.. ఆమె సంగ‌తి చూడాల‌ని చెప్పాడు. త‌మ‌కు ఇంత సాయం చేస్తున్న వ్య‌క్తి బ్యాంకు అకౌంట్ వివ‌రాలు చెబితే.. డ‌బ్బులు పంపుతామ‌ని ఈ త‌ల్లీకూతుళ్లు కోరితే.. అక్క‌ర్లేద‌ని చెప్పేశాడు.

ఉద‌యం ఏడు గంట‌ల స‌మ‌యంలో పార్కు లో ఏడుస్తూ కూర్చున్న స్వాతి.. అదే రోజు ఉద‌యం 11.45 గంట‌ల‌కు కోయంబ‌త్తూర్ చేరుకోవ‌ట‌మే కాదు.. సీటు కూడా సొంతం చేసుకుంది. బ‌యో టెక్నాల‌జీ కోర్సు లో చేరేందుకు సీటు పొందిన స్వాతి తెగ సంతోష‌ప‌డిపోయి.. దేవుడిలా వ‌చ్చి ఆదుకున్న వ్య‌క్తికి ఎన్ని థ్యాంక్స్ లు చెప్పినా స‌రిపోవంటోంది. ఇంత సాయం చేసిన వ్య‌క్తి మాత్రం త‌న వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా ఉండిపోవ‌టం.. ఇంత‌కీ ఆ ప‌వ‌ర్‌ ఫుల్ మ‌నిషి ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమాల్లో మాత్ర‌మే క‌నిపించే ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న‌చుట్టూ ఉన్న స‌మాజంలో జ‌ర‌గ‌టం చూసిన‌ప్పుడు.. మాన‌వ‌త్వం కుప్ప‌లు.. కుప్ప‌లుగా ఉంద‌నిపించ‌క మాన‌దు.