Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో సీఎంగా ఆమెకు ఛాన్స్!

By:  Tupaki Desk   |   10 Aug 2022 7:35 AM GMT
క‌ర్ణాట‌క‌లో సీఎంగా ఆమెకు ఛాన్స్!
X
క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఏ ముహూర్తంలో అధికారంలోకి వ‌చ్చిందో కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు పూర్తి స్థాయిలో ఐదేళ్లు అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రి ఒక్కరు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 2008 మేలో తొలిసారి ద‌క్షిణ భార‌త‌దేశంలో.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధికారాన్ని ద‌క్కించుకుంది. దీంతో బీఎస్ యుడియూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే కేవ‌లం మూడేళ్లు మాత్ర‌మే సీఎంగా ప‌నిచేశారు. 2011 ఆగ‌స్టులో అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. దీంతో మ‌రో బీజేపీ నేత స‌దానంద గౌడ సీఎం అయ్యారు. స‌దానంద కూడా ఏడాది కూడా ప‌ద‌విలో లేరు. నిత్యం సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి చెల‌రేగ‌డం, బీజేపీ అధిష్టానానికి అసమ్మ‌తి నేత‌లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయ‌డంతో ఆయ‌న 2012 జూలైలో సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

ఇక 2012 జూలై నుంచి మ‌రో బీజేపీ నేత జ‌గ‌దీష్ షెట్టార్ సీఎం ప‌ద‌విని చేప‌ట్టారు. ఈయ‌న కూడా కేవ‌లం 305 రోజులు మాత్ర‌మే ప‌ద‌విలో ఉన్నారు. అస‌మ్మ‌తి పోరుతో సీఎం ప‌దవి నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత 2013లో జ‌రిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఆ పార్టీ త‌ర‌ఫున సిద్ధ‌రామ‌య్య ఐదేళ్లు పూర్తి ప‌ద‌వీకాలం ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ మెజారిటీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో జేడీఎస్ అధినేత కుమార స్వామి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కుమార‌స్వామి కూడా ఏడాది కాలం మాత్ర‌మే సీఎంగా ఉన్నారు.

కొంత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను చీల్చి బీజేపీ అధికారం చేప‌ట్టింది. 2019 జూలై నుంచి 2021 జూలై వ‌ర‌కు రెండేళ్ల‌కు పైగా యుడియూర‌ప్ప సీఎంగా ఉన్నారు. అయితే ఆయ‌న‌కు 75 ఏళ్ల వ‌య‌సు రావ‌డం, అవినీతి ఆరోప‌ణ‌లు త‌దిత‌ర కార‌ణాల‌తో బీజేపీ అధిష్టానం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టింది. యుడియూర‌ప్ప శిష్యుడు, లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన బ‌స‌వ‌రాజ బొమ్మెని సీఎంను చేసింది. ఆయ‌న అధికారం చేప‌ట్టి ఏడాది పూర్తి అయ్యింది.

అయితే బ‌స‌వ‌రాజ్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచే అస‌మ్మ‌తి పోరు మొద‌లైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ‌రి ఇష్టానుసారం వారు వ్యాఖ్య‌లు చేశారు. హిజాబ్ వివాదం, మ‌త ఘ‌ర్ష‌ణలు త‌దిత‌ర కార‌ణాల‌తో బ‌స‌వ రాజ్ బొమ్మై పాల‌నేమీ అధ్భుతంగా లేద‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనే త‌ర‌చూ ఘ‌ర్ష‌ణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బ‌స‌వ‌రాజ్ ను మార్చాల‌నే డిమాండ్లు మొద‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర జౌళి శాఖ స‌హాయ మంత్రి, యుడియూర‌ప్ప అత్యంత స‌న్నిహితురాలైన శోభా క‌రంద్లాజేని ముఖ్య‌మంత్రిగా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌కు అవ‌కాశ‌మిస్తే ఉప‌యోగం ఉంటుంద‌ని బీజేపీ భావిస్తోందని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే శోభ కరంద్లాజేని సీఎంని చేయ‌డానికి అస‌మ్మ‌తి నేత‌లు ఒప్పుకుంటారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే శోభ‌.. యుడియూర‌ప్ప గీసిన గీత దాట‌ర‌ని టాక్ ఉంది. ఆయ‌న బీజేపీతో విభేదించి కొత్త పార్టీ పెట్టిన‌ప్పుడు ఆమె కూడా ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. మ‌ళ్లీ యుడియూర‌ప్ప బీజేపీలో చేర‌గానే ఆయ‌న‌తో పాటు వ‌చ్చేశారు. అలాంటి ఆమెకు సీఎం ప‌ద‌వి ఇచ్చినా ర‌బ్బ‌ర్ స్టాంపుగా మిగిలిపోతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఆయన మార్పు దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇక సీఎం ప‌ద‌వికి శోభా క‌రంద్లాజేతోపాటు ఇంధన శాఖ మంత్రి సునీల్ కుమార్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.